ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్ధాలుగా కులరాజకీయాలు నడుస్తున్నప్పటికీ ప్రజలు ఎన్నడూ ఇంతగా చీలిపోలేదు. ఇప్పుడు పార్టీల వారీగా, కులమతాల వారీగా చీలిపోయి ఒకరినొకరు అనుమానంగా చూసుకొనే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రా, తెలంగాణ విడిపోతున్నప్పుడు అక్కడ ఇటువంటి పరిస్థితులే ఉండేవి.
గత ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కులం పేరు చెప్పుకొని ఓట్లు అడగనందుకు కాపులు ఆయనను కాదని వైసీపీ వైపు మొగ్గారు. పవన్ కళ్యాణ్‌కు ఇది అర్దం కావడంతో ఈసారి తన గోత్రనామాలు చెప్పుకొని కాపులు కూడా తనకు ఓట్లు వేయాలని అభ్యర్ధిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌లో అనివార్యమైన ఈ మార్పు ఆయనను అభిమానించేవారికి కాస్త చివుక్కుమనిపిస్తుంది.
Also Read – విశాఖ మేయర్ పీఠం కూటమికే… సంతోషమేనా?
పవన్ కళ్యాణ్ కాపులను కూడా కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తుండటంతో వైసీపీ అప్రమత్తమైంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంని ప్రసన్నం చేసుకొని ఆయన భుజంపై తుపాకి పెట్టి పవన్ కళ్యాణ్‌కి గురిపెడుతోంది.
రాజకీయాలలో అపార అనుభవం ఉన్న ముద్రగడకు ఈవిషయం తెలియదనుకోలేము. అయితే టిడిపి హయాంలో ఆయన కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కోవడంతో వైసీపీ తరపున టిడిపి, జనసేనలతో యుద్ధం చేస్తున్నారు.
Also Read – రెట్రో (Retro) ట్రైలర్ – ఆ స్థాయి కొత్తదనాన్ని చూపించడంలో విఫలం.
ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలు, దౌర్జన్యాల గురించి ప్రస్తావిస్తూ జనసేన కార్యకర్తల జోలికి రావద్దని చాలా ఘాటుగానే హెచ్చరించారు. అప్పుడు ఆయన కూడా అంతే ధీటుగా బదులిచ్చారు. అయితే మద్యలో ముద్రగడ కూడా ప్రవేశించి, ద్వారంపూడి తరపు వకాల్తా పుచ్చుకొన్నట్లు పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తూ ఓ బహిరంగలేఖ విడుదల చేశారు.
దానిలో తాను కులం కోసం పోరాడానే తప్ప కులం పేరు చెప్పుకొని డబ్బు, పదవులు, అధికారం కోసం ఆరాటపడలేదన్నారు. అయితే నిజాయితీగా చేసిన పోరాటంలోనే ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రౌడీల భాషలో బెదిరిస్తూ మాట్లాడటం సరికాదని, వీలైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ వంటి సమస్యలపై పోరాడాలని హితవు పలికారు. ద్వారంపూడిని విమర్శించడం తగదని, దమ్ముంటే వచ్చే ఎన్నికలలో ఆయనపై పోటీచేసి గెలిచి చూపాలని సవాల్ విసిరారు.
Also Read – స్మితా సభర్వాల్: ఈమెను ఎలా డీల్ చేయాలబ్బా!
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశ్యించి సాక్షాత్ ముఖ్యమంత్రి అనుచితంగా మాట్లాడుతుంటారు. మంత్రులు అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజు, రోజా, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కొడాలి నాని ఎటువంటి భాష ఉపయోగిస్తారో బహుశః ముద్రగడ కూడా నాలుగేళ్ళుగా వింటూనే ఉన్నారు. కానీ ఏనాడూ వారి భాషపై ఈవిదంగా అభ్యంతరం చెప్పలేదు. వారిని పాలనపై దృష్టి పెట్టి పనిచేయమని హితవు చెప్పలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ గురించి వారికి ఏనాడూ గుర్తుచేయలేదు. ఎందుకంటే, ఆయన వారి వైపు ఉన్నారు కనుక.
అయితే ఎవరు ఎవరివైపు ఉన్నప్పటికీ, ముద్రగడ కూడా ఈ రాష్ట్ర పౌరుడే. కనుక రాష్ట్రం పరిస్థితిని చూస్తూ కూడా భీష్ముడు పాత్ర పోషిస్తుండటమే చాలా బాధాకరం. పైగా ఇటువంటి క్లిష్ట సమయంలో కాపులను సమైక్య శక్తిగా మలిచి ఏపీని కాపాడుకొనే ప్రయత్నం చేయాల్సి ఉండగా, ఆయనే ఈవిదంగా కాపుల ఓట్లు చీల్చడానికి ఉపకరిస్తుండటం చాలా బాధాకరమే.
అసలు మనకి రాజకీయాలు ముఖ్యమా? కులం ముఖ్యమా? రాష్ట్రం ముఖ్యమా? అని ఎవరికివారు ప్రశ్నించుకోవలసిన సమయం ఇది. కనుక ఆంధ్రప్రదేశ్ మరింత పతనం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరి మీద ఉంది… ముద్రగడ పద్మనాభంతో సహా!