అమరావతిలో తనపై వచ్చిన భూదందా ఆరోపణల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తపరిచిన రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్, తాజాగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరింత స్పష్టత ఇచ్చారు. “ఒక్క హైదరాబాద్ మినహా గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి మరి ఏ ఇతర జిల్లాలో తనకు కనీసం సెంటు భూమి కూడా లేదని అన్నారు. వెస్ట్ గోదావరిలో మాత్రం తన భార్యకు వాళ్ల అమ్మానాన్నలిచ్చిన 7 ఎకరాల కొబ్బరి తోట మాత్రం ఉందని, ఇవి తప్ప జయభేరి పేరిట, బినామీల పేరిట వందల ఎకరాలు కొన్నాను అన్నది పూర్తిగా అవాస్తవమని” కొట్టిపడేసారు.
“తాను తప్పు చేయనని, ఒకవేళ చేస్తే ఆ తర్వాత ఉండను అని, రాజధాని సమీపంలో గల కుంచనపల్లిలో 7 ఎకరాల భూమిని కొనుగోలు చేద్దామని వెళితే యజమాని అమ్మనని చెప్పగా, జాయింట్ గా కలిసి దీనిని అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకున్నామని, భూమి ఆయనది, కన్ స్ట్రక్షన్ ఖర్చు తనది అని, ఆ మేరకు ఒక జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నామని, దీని నిర్మాణ నిమిత్తం తానూ సీఆర్డీఏకు దాఖలు చేసుకుని ఒక ఏడాది గడిచిందని, కానీ సాక్షి పత్రిక మాత్రం అధికారులు ఉరుకులు పరుగుల మీద పని చేసారని రాసిందని, ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయిస్తానని, త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని” అన్నారు.
“తానూ వ్యాపారం చేసే భూమి మీద, తల్లిదండ్రుల మీద, పిల్లల మీద కూడా ప్రమాణం చేస్తానంటూ” ఉద్వేగభరితమైన మురళీమోహన్… తనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయకపోతే వచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలని తీవ్ర పదజాలంతో స్పందించారు. “జగన్ అంత నీచ స్థితికి తానూ దిగజారలేనని, నా స్థాయికి జగన్ సరిపోరని, అలాంటి జగన్ ను పెద్ద వాడ్ని చేసే ఉద్దేశం తనకు లేదని, ఏ బినామీ పేరుతో తాను భూములను కొన్నానో చెబితే యాభై శాతం భూములు వారికి ఇచ్చి, మిగిలినది నవ్యాంధ్ర రాజధాని ఫండ్ గా ఇస్తానని, అలాగే హాయ్ లాండ్ విషయం వచ్చిన ఆరోపణలను కూడా ఖండిస్తూ… హాయ్ లాండ్ ను కొనుగోలు చేసేటంత డబ్బు తన వద్ద లేదని” అన్నారు.





