‘మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఏం మంచి ఉందని చెప్పమంటారు?’ అని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు షాకింగ్ కామెంట్స్ చేసారు. ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి తన అనుభూతులు చెప్పుకొచ్చిన నాదెండ్ల… బహుశా ఎవరూ ఊహించని సమాధానాలను చెప్పుకొచ్చారు. “ఎన్టీఆర్ లో పాజిటివ్ విషయాలు నేనైతే గ్రహించలేదు. అతని గురించి ఏం మంచి ఉందని చెప్పమంటారు? ఆయనలో మంచి ఏమిటంటే.. ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను కూడా ‘రండి’ అంటూ గౌరవిస్తారు. ఎన్టీఆర్ తన భార్యను కూడా ‘రండి’ కూర్చోండి అంటాడని” అన్నారు.
నాడు టీడీపీలో తానే నెంబర్ వన్ అని, ఎన్టీఆరే నెంబర్ టు అని, ఆ రోజు మీడియా అంతా నేను దుర్మార్గుడిని, ఎన్టీఆర్ సన్మార్గుడు అన్నట్లుగా చిత్రీకరించింది. ఆయన చేసిన పాపాలన్నీ చెబితే ‘తూ’ అని ఉమ్మేస్తారు. ఎన్టీఆర్ ను అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో నేను ఎప్పుడూ తప్పుడు సలహాలు ఇవ్వలేదు. భగవత్ సాక్షిగా చెబుతున్నాను.. అట్లాంటి పనులు నేను చేయను. నాడు చంద్రబాబు సలహాలు చెబుతుండేవాడు. ఆ సలహాలను విని పూనకంతో ఎన్టీఆర్ వచ్చేవాడు…. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం గురించి ఎన్టీఆర్ కు ఏం తెలుసు?’ అని నాదెండ్ల భాస్కరరావు అన్నారు.
స్వయంగా ఎన్టీఆరే తన అల్లుడు చంద్రబాబును తార్పుడు గాడు అని, రెండు వందల కోట్లు తినేశాడని అన్నారని, ఎన్టీఆర్ కు నేను వెన్నుపోటు పొడిచాననడం చాలా తప్పు, ఎన్టీఆరే నన్ను వెన్నుపోటు పొడిచాడు. పొలిటికల్ గా నాకు ఉన్న స్కిల్స్, ఎన్టీఆర్ చరిష్మా కారణంగానే కాంగ్రెస్ పార్టీని పడగొట్టాం. గంగా, యమున ఏకమయ్యాయి కనుక, కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. నా మూలంగానే టీడీపీ పుట్టింది, సినిమాల్లో హీరోగా ఆయన కనపడ్డా, నిజ జీవితంలో పెద్ద విలన్ ఆయన అంటూ షాక్ కలిగే వ్యాఖ్యలు చేసారు.
టిక్కెట్ల ఎంపికలో మా ఇద్దరిలో ఎవరిదీ పైచేయి కాదు. ఇద్దరం చాప వేసుకుని కూర్చున్నాము. ఎన్టీఆర్ అయితే, అసలు పోటీ చేయనని కూర్చున్నాడు. ఎందుకంటే, భయం… ఓడిపోతాననే భయం. ఎన్టీఆర్ వియ్యంకులు ఆయన్ని డిస్కరేజ్ చేశారు. మానవ నైజం చెబుతున్నాను… ఎంత ధైర్యస్తులో అంత పిరికివాళ్లు కూడా… అని, రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారు కనుక, సినిమా వాళ్లు సీఎంలు అయ్యారని నాదెండ్ల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పడిపోతోందని, ఆ పార్టీని మళ్లీ బతికించాలంటే ఎన్టీఆర్ పై బయోపిక్ తీయడమే మార్గమని భావించారని, అందుకే, ఈ చిత్రం తీస్తామని ప్రకటించారని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు అభిప్రాయపడ్డారు.
‘కృష్ణుడు, రాముడు.. బొమ్మలు అన్నీ చూపిస్తే, పిచ్చి జనం అంతా మళ్లీ వస్తారనే ఉద్దేశంతో ఎన్టీఆర్ పై బయోపిక్ మొదలు పెట్టారు. వియ్యంకుడు బాలకృష్ణ ను పిలిచి సినిమా తీయాలని చంద్రబాబు చెప్పాడు. వియ్యంకుడికి సినిమా బాధ్యతలు అప్పజెబితే… చంద్రబాబు తన కొడుకుని మంత్రి చేసుకోవచ్చు. మంత్రి పదవి కొడుక్కి ఇవ్వాలా? వియ్యంకుడికా? బాలకృష్ణ ఏమో ఎమ్మెల్యే, చంద్రబాబు కొడుకేమో ఎమ్మెల్యే కాదు. కనుక, మంత్రి పదవి తన కొడుక్కి ఇవ్వాలంటే… బాలకృష్ణను పక్కకు తోసెయ్యాలి. మరి పక్కకు తోసెయ్యాలంటే… బాలకృష్ణను సినిమా తీయమని, కావాలంటే డబ్బులు తీసుకోమని చెప్పారు’ అంటూ చెప్పుకొచ్చారు.
‘ఈ చిత్రంలో మిమ్మల్ని విలన్ గా చూపించనున్నారటగా?’ అనే ప్రశ్నకు నాదెండ్ల సమాధానమిస్తూ… ఈ బయోపిక్ లో తన పాత్ర ఉండదని అనుకుంటున్నానని, ప్రతి సినిమాలో విలన్ ఉండాలనే రూల్ ఏదీ లేదని, ఆ విధంగా చేస్తే కోర్టుకు వెళతానని, అప్పుడు ఆ సినిమా రిలీజ్ ఏ విధంగా అవుతుందని అన్నారు. తనకు, బాలకృష్ణకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, బాలకృష్ణ తీయబోయే చిత్రంలో తన తండ్రి సినిమా జీవితాన్ని మాత్రమే తీసుకుంటే ఫర్వాలేదు గానీ, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి తీస్తే బాలకృష్ణ చాలా చిక్కుల్లో పడతాడని అన్నారు. సినిమా తీసే ముందు బాలకృష్ణ తనను సంప్రదిస్తే, వాస్తవాలు చెబుతానని నాదెండ్ల అన్నారు.



