ప్రేమ వార్తలకు ఇప్పటికే పుల్ స్టాప్ పెట్టిన అక్కినేని నాగచైతన్య పెళ్లి విషయంలోనూ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాదే తను, సమంత పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపాడు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమకధ గురించి చెప్పుకొచ్చాడు చైతూ. తాము ప్రేమలో ఉన్న విషయం ఇరు కుటుంబ సభ్యులందరికీ తెలుసని పేర్కొన్నాడు.
వృత్తి పరంగా ఆర్భాటాలు తప్పవని కానీ వ్యక్తిగతంగా తనకు, సమంతకు అవి నచ్చవని చెప్పాడు. వచ్చే ఏడాది బంధుమిత్రుల సమక్షంలో ‘టేస్ట్ ఫుల్’గా పెళ్లి చేసుకుంటామని వివరించాడు. ‘ఏమాయ చేసావే’ సినిమా చేస్తున్పటి నుంచే సమంతతో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తమకు తెలియకుండానే ‘బెస్ట్ ఫ్రెండ్స్’గా మారిపోయామని తెలిపాడు. తమది ఏ ఒక్క రోజులోనో పుట్టిన ప్రేమ కాదని పేర్కొన్న చైతూ, ఇప్పటివరకు ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదని పేర్కొన్నాడు.
తనకు 30 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, అప్పుడు సమంత తప్ప మరే అమ్మాయి గుర్తుకు రాలేదన్నాడు. ఈ ఏడాదిలోనే తాను సమంత వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చినట్టు చెప్పిన చైతూ… ఓ రోజు సమంత వద్దకు వెళ్లి “ఎన్ని రోజులు ఇలా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌గా ఉంటాం… పెళ్లి చేసుకుందాం… నాకు నువ్వు కరెక్ట్ అనిపిస్తోంది” అని చెప్పానని తెలిపాడు. “పెళ్లి వద్దనుకుంటే మాత్రం ఇక్కడితో ఆపేద్దామని” అన్నానని, అప్పుడే తన ఇష్టాన్ని సమంత వ్యక్తం చేసిందని, ఆ క్షణమే తాము పెళ్లితో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నామని తన ప్రేమ కబుర్లు చెప్పాడు నాగచైతన్య.



