తెలుగుతో పోలిస్తే మేము వెనుకబడ్డాం: తమిళ్ డైరెక్టర్

Director Venkat Prabhuదేశం మొత్తం మీద చూసుకుంటే ఏ ఇతర భాషతో పోల్చినా తెలుగు సినిమా స్థాయి అంత సులభంగా అందుకోలేని ఎత్తుకు ఎదిగిందన్నది వాస్తవం. ఆర్ఆర్ఆర్ జపాన్ లో రెండు వందల రోజులకు దగ్గరలో ఉంది. కలెక్షన్ల పరంగా టాప్ వన్ ప్లేస్ ఎప్పుడో తీసుకుంది. బాహుబలికి జపాన్ చైనాలో బ్రహ్మరధం పట్టారు. పుష్పకు నార్త్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సీక్వెల్ కి జరుగుతున్న బిజినెస్ చూస్తే మతులు పోవడం ఖాయం. ఇదంతా గత పదేళ్లలోపే సాధించిన అద్భుతమైన ఘనతనేది కాదనలేని సత్యం.

ఇదంతా స్వయంగా ఒక కోలీవుడ్ దర్శకుడు ఒప్పుకున్న వాస్తవం. నాగ చైతన్య కస్టడీ డైరెక్టర్ వెంకట్ ప్రభు మీడియా సాక్షిగా చాలా ఓపెన్ గా మాట్లాడేశారు. పొన్నియిన్ సెల్వన్ తమిళనాడులో విరగబడి ఆడినా బయట పెద్దగా చూడలేదు. తెలుగులో మొదటి భాగం పది కోట్లకే కిందా మీద పడితే ఇప్పుడు పీఎస్ 2 నాలుగో రోజే చాలా కేంద్రాల్లో చెమటలు చిందిస్తోంది. మణిరత్నం ఎంత గొప్ప దర్శకుడైనా ఎంత నిజాయితీగా నవలను తెరకెక్కించినా అందులో ఎమోషన్ కానీ అసలు జాడే లేని ఎలివేషన్లు కానీ మన ప్రేక్షకులకు ఎక్కలేదు.

ADVERTISEMENT

ఇదొక్కటే కారణం కాదు. వెంకట్ ప్రభు చెప్పిన మరొక ఇంటరెస్టింగ్ పాయింట్ ఉంది. తమిళ డైరెక్టర్లు కేవలం అక్కడి ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తున్నారు. అందువల్లే బయటి వాళ్లకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాయి. ఒకప్పుడు రోజా, బొంబాయి, జెంటిల్ మెన్, భారతీయుడు లాంటి డబ్బింగ్ మూవీస్ ఉమ్మడి ఏపీ తెలంగాణలో వంద రోజులు ఆడాయి. నరసింహ, అపరిచితుడులకు సిల్వర్ జూబ్లీలున్నాయి. విక్రమ్, రజనీకాంత్ రిలీజ్ డేట్లు వస్తే వాటితో క్లాష్ అయ్యేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది.

ఇప్పుడంతా మారిపోయింది. ఒకప్పటి తెలుగు మార్కెట్ ని ప్రభావితం చేసిన తమిళ స్టార్ హీరోలు ఇప్పుడు సింగిల్ డిజిట్ బిజినెస్ కు వచ్చేశారు. రజనికే అయిదారు కోట్ల కంటే ఎక్కువ రేట్ పలకడం లేదు. ఈ రివర్స్ ట్రెండ్ ని జీర్ణించుకోలేకే ఆరవ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మనల్ని అనవసరంగా విమర్శించిన ఉదంతాలున్నాయి. విక్రమ్ ని ఆదరించింది మర్చిపోయారు. ఖైదీని బ్లాక్ బస్టర్ చేయడం పట్టించుకోలేదు. ఏవి ఎలా ఉన్నా టాలీవుడ్ జెండాని అంత సులభంగా ఎవరూ అందుకోలేని హైట్ లో మన దర్శకులు పాతిన నిజాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories