నేడు విడుదలైన “మహానుభావుడు” సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో, ఈ చిత్ర దర్శకుడు మారుతీ పేరు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. గతంలో నానితో తీసిన ‘భలే భలే మగాడివోయ్’ సూపర్ సక్సెస్ తర్వాత విక్టరీ వెంకటేష్ తో అవకాశం రావడంతో, ‘మహానుభావుడు’ తర్వాత మారుతీ ఎవరితో జత కట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై స్వయంగా మారుతీనే ఓ స్పష్టత ఇచ్చాడు.
‘మహానుభావుడు’ సినిమాను నిజానికి అక్కినేని అఖిల్ తో తీయాల్సి ఉందని, కానీ డేట్స్ కుదరకపోవడంతో శర్వానంద్ తో తీసానని తెలిపిన మారుతీ, తన తదుపరి చిత్రాన్ని అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కించ బోతున్నానని తెలిపారు. ప్రేమ, వినోదం కలగలిపిన కధతో ఈ సినిమా తెరకెక్కనుందని స్పష్టత ఇచ్చిన వార్త, అక్కినేని ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీలో ముంచెత్తింది.
ప్రస్తుతం చైతూకు కూడా ఖచ్చితంగా ఓ హిట్ కావాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్న “యుద్ధం శరణం” దారుణ పరాజయం పొందడంతో, ప్రస్తుతం “సవ్యసాచి”పై దృష్టి పెట్టాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తర్వాత మారుతీ – చైతూ జోడి తెరపైకి రానుందన్న మాట. మరి చైతూకు కూడా ఓ ‘భలే భలే మగాడివోయ్’ గానీ, మరో ‘మహానుభావుడు’ గానీ ఇస్తారేమో చూడాలి.


