గుంటూరు కారం ఘాటు సరిపోలేదా?

Guntur-Kaaram-Naga-Vamsi

త్రివిక్రమ్ శ్రీనివాస్‌, మహేష్‌ బాబు కాంబినేషన్‌లో సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా కోసం హనుమాన్‌ని పక్కన పెట్టడం శాపంగా మారిన్నట్లుంది. ఆ వివాదం నుంచి బయటపడే సరికి ఇప్పుడు సినిమా కలెక్షన్లపై రగడ నడుస్తోంది.

ఈ రెండు సినిమాలు విడుదల కాకమునుపు ‘హనుమాన్‌’ ప్రెస్‌మీట్‌లో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ప్రశాంత్ వర్మ, తేజా సజ్జాలతో “మీకూ, మీ సినిమాకి అంత సీన్ ఉందా… సంక్రాంతి బరిలో దిగుతున్నారు…” అంటూ చాలా చులకనగా మాట్లాడారు. కానీ ఇప్పుడు అదే జర్నలిస్టులు ‘గుంటూరు కారం’ నిర్మాత నాగవంశీతో ఆడేసుకుంటున్నారు.

ADVERTISEMENT

అప్పుడు హనుమాన్‌ పట్ల వారు ఆవిదంగా ప్రవర్తించడం, ఇప్పుడు ‘గుంటూరు కారం’ పట్ల ఈవిదంగా ప్రవర్తించడం రెండూ తప్పే అని చెప్పక తప్పదు.

ఇంతకీ వివాదం ఏమిటంటే ‘గుంటూరు కారం’ సినిమాపై భారీ అంచనాలు ఉండగా మిశ్రమ స్పందన వచ్చింది. రివ్యూలు కూడా బాగోలేదు. అయినప్పటికీ మహేష్‌ బాబు సినిమా కనుక అందరూ ఓసారి చూసి వస్తుండటంతో సినిమా కలెక్షన్స్ నిలకడగా ఉంటాయి.

అయితే నిర్మాత నాగవంశీ తాజా ఇంటర్వ్యూలో, “ఫ్యామిలీ ఎంటర్‌టైయినర్ అని ముందుగా చెప్పకపోవడం వలననే ప్రేక్షకులు మాస్ ఎంటర్‌టైయినర్ అనుకుని థియేటర్లుకు వచ్చారని, అందువల్లే కాస్త నిరాశ చెందారని సమర్ధించుకున్నారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైయినర్‌ని రాత్రి ఒంటి గంటకు స్పెషల్ షో వేయడం కూడా పొరపాటే అని దాని వలన తమ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందని, కానీ ఫస్ట్ షో నుంచి సినిమా పుంజుకుని దూసుకుపోతోందని నాగవంశీ చెప్పారు.

ప్రేక్షకులు రివ్యూలని పట్టించుకోకుండా థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్నారని దాని వలన సినిమా కలెక్షన్స్ రూ.212 కోట్లు దాటేశాయని, బయ్యర్లు బ్రేక్ ఈవెన్ చేరుకుంటున్నారని నాగవంశీ చెప్పారు.

ఏ సినిమా అయిన హిట్ అవడం, మంచి కలెక్షన్స్ సాధించడం నిర్మాతలకే కాదు ఇండస్ట్రీలో అందరికీ అవసరమే. కనుక దిల్‌రాజు చెప్పిన్నట్లుగా ‘గుంటూరు కారం’ కూడా నెగెటివ్ టాక్ నుంచి బయటపడి దూసుకుపోతే అందరికీ సంతోషమే.

అయితే సినిమా కలెక్షన్స్ రూ.212 కోట్లు దాటాయనే విషయంపై ఓ మీడియా సంస్థ స్పందిస్తూ “మీరు చెప్పింది నిజమే అయితే ఏరియాల వారీగా కలెక్షన్స్ ఎంత వచ్చాయో చెప్పగలరా?” అంటూ నిర్మాతని నిలదీయడంతో మళ్ళీ ‘గుంటూరు కారం’ ఘాటు మీడియా అంతటా వ్యాపిస్తోంది.

దీంతో నిర్మాత నాగవంశీ సహనం కోల్పోయి ఘాటుగా స్పందిస్తూ, “పదేపదే ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకోవలసి రావడం చాలా బోర్‌గా అనిపిస్తోంది. అదీ… నిద్రపోతే సమయంలో… ఇండస్ట్రీలో నువ్వు ఒక్కడివే కలక్షన్స్ గురించి ప్రశ్నిస్తున్నావు. నువ్వు సినిమా నిర్మాతతో మాట్లాడుతున్నానని గుర్తుంచుకో. ఇది నా సినిమా. నువ్వు తప్పుడు కూతలు కూస్తున్నావు. కనుక ఎవరికి ఎవరు సమాధానం చెప్పుకోవాలి? గుడ్ నైట్!” అని ట్వీట్‌ చేశారు.

ఓ సినిమాని తీయడానికి అనేకమంది రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే గట్టి నమ్మకంతోనే నిర్మాతలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకుంటారు. నటీనటులు కూడా సినిమా హిట్ అయ్యి తమకు మరింత మంచిపేరు రావాలనే కోరుకుంటారు.

అయితే ఒక్కోసారి సినిమాలు ఫెయిల్ అయినప్పుడు వారందరి కష్టం, నిర్మాత డబ్బు అంతా వృధా అవుతుంది. అయినప్పటికీ థియేటర్లో ఉన్న తమ సినిమాను నెలబెట్టుకోవాలని ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. బహుశః నాగవంశీ కూడా అదే చేస్తుండవచ్చు.

‘గుంటూరు కారం’ హిట్టా, ఫట్టా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు కనుక సినీ జర్నలిస్టులు కాస్త సంయమనం పాటించి దర్శక నిర్మాతలకు తోడ్పడాలి కానీ ఇలా ఇబ్బంది పెట్టడాన్ని ఎవరూ హర్షించలేరు.

ADVERTISEMENT
Latest Stories