అభివృద్ధితో అధికారం అసాధ్యం… వ్యూహాలు తప్పనిసరి!

Political strategy and development

ఇప్పుడు దేశంలో రాజకీయాలు ఓ అసాధారణ దశకు చేరుకున్నాయి. అధికార పార్టీలు దేశాన్ని లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం కనుక మాకు జనం ఓట్లేసి గెలిపిస్తారని భావించడం లేదు. తమ ప్రత్యర్థులపై సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగిస్తున్నాయి.

ఉదాహరణకు గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే మోడీ ప్రభుత్వ హయంలో దేశంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మౌలిక వసతుల కల్పనపై కేంద్ర ప్రభుత్వం వేలకోట్లు ఖర్చుచేస్తోంది. వైద్య ఆరోగ్య, రక్షణ, అంతరిక్ష రంగాలలో ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు కల్పించడం ద్వారా కొత్త పరిశ్రమలు, సంస్థలు ముందుకు వస్తున్నాయి. అయినప్పటికీ దేశాభివృద్ధితో పాటు రాజకీయాలు కూడా సమాంతరంగా చేస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

వాటిలో భాగంగానే బీజేపీ ప్రత్యర్థి పార్టీల ఓటర్ల తొలగింపు, ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడం, డీలిమిటేషన్-మహిళా బిల్లులను ముడిపెట్టడం వంటి రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్‌, మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం, తెలంగాణలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం ద్వారా ఎదురులేకుండా సాగాలనుకున్నాయి. కానీ అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ పార్టీలు గట్టిగా నిలబడి పోరాడి అధికారంలోకి వచ్చాయి.

ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, నైతిక విలువలు అంటూ మాట్లాడుతున్నప్పటికీ అవి కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేదు.

ఇక్కడ వైసీపీ, అక్కడ బీఆర్ఎస్‌ పార్టీలు ప్రస్తుత ప్రభుత్వ హయంలో అప్పులు, అవినీతి, రాష్ట్రంలో నిరుద్యోగం, శాంతిభద్రత సమస్యలు పెరిగిపోయాయంటూ ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆకర్షణీయమైన, ఆచరణ సాధ్యం కాని భారీ ఎన్నికల హామీలతో తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను చేజిక్కించుకోగలిగింది.

అమరావతి, పోలవరం, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలే వచ్చే ఎన్నికలలో గెలిపిస్తాయని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. కానీ గతంలో ఈవిధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం వలనే ఓడిపోయామని కనుక ఈసారి పాలనతో పాటు రాజకీయాలు కూడా చేస్తానని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

కానీ మళ్ళీ ఆయన అభివృద్ధిలో పడి ఆ మాట మరిచినట్లే ఉన్నారు. తాము చేస్తున్న అభివృద్దే తమని గెలిపిస్తుందనే నమ్మకంతో వైసీపీ రాజకీయాలను సమర్థంగా ఎదుర్కోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది.

చివరిగా ఒక మాట: ఇప్పుడు దేశాల మధ్య యుద్ధాలలో క్షిపణులు, డ్రోన్లు ఎటువంటి మార్పు తెచ్చాయో, అదేవిధంగా దేశ రాజకీయాలలో డేటా, సామాజిక మాధ్యమాలు, వ్యూహాలు, కేసులు వంటి కొత్త ఆయుధాలు రాజకీయాల స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. వీటిని సమర్ధంగా ఉపయోగించుకునే పార్టీలు, నాయకులే రాజకీయాలలో రాణించగలుగుతున్నారు. కనుక వర్తమాన రాజకీయాలలో నైతిక విలువలు నేతి బీరకాయలో నెయ్యి వంటివి కాగా, వ్యూహాలే కీలకంగా మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories