ఇక మెగా సోదరులు ఎవరూ సొంత జిల్లా నుండి పోటీ చేసే సాహసం చెయ్యరా?

Nagababu- pawan kalyan -janasena partyజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా … భీమవరం, గాజువాకలలో ఓడిపోయారు. తన తొలి ఎన్నికలలో అసెంబ్లీకి వచ్చే అవకాశం పొందలేక పోయారు. సామాజికవర్గాల పరంగా రెండూ అనుకూలమైన స్థానాలు తీసుకున్నా విజయం సాధించలేకపోయారు. సొంత జిల్లాలో ఓడిపోవడం జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. భీమవరం నరసాపురం పార్లమెంట్ కిందకు వస్తుంది. అక్కడ నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు కూడా ఓడిపోయారు.

ADVERTISEMENT

ఆయన మూడో స్థానానికే పరిమితం అయిపోయారు. ఏ రౌండ్ లోను కనీసం ప్రభావం చూపించలేకపోవడం విశేషం. చివరి నిముషంలో ఆయనను పార్టీలోకి తెచ్చి టిక్కెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. దీనితో ముగ్గురు మెగా బ్రదర్స్ తమ సొంత జిల్లా నుండే ఓడిపోయినట్టు అయ్యింది. 2009 ఎన్నికలలో జిల్లా లోని పాలకొల్లు నుండి పోటీ చేసిన మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పట్లో ఓడిపోయారు. దీనితో ఈ పరిణామాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బహుశా మెగా సోదరులు ఎవరూ భవిష్యత్తులో జిల్లా నుండి పోటీ చేసే సాహసం చెయ్యరని విశ్లేషకులు అనుకుంటున్నారు.

ఇక జనసేన పార్టీ నుండి ఒకే ఒక్కరు గెలవగలిగారు. రాజోలు నుండి రాపాక వరప్రసాద్ గెలిచారు. ఆ ఒక్కరితోనే జనసేన అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాటం చెయ్యాలి. అది కూడా ఆయన ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఉండగలిగితేనే. ఈ ఘోరపరాజయం నుండి టీడీపీ కోలుకోకపోతే జనసేనకు మంచి అవకాశం ఉండవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వచ్చే ఐదు సంవత్సరాలు జనసేన పోరాటపటిమకు, పవన్ కళ్యాణ్ ఓర్పుకూ పరీక్ష అనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories