నంద్యాల ఉప ఎన్నికల ఫలితం వెలువడుతున్న నేపధ్యంలో… తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో మీడియా వర్గాలన్నీ ఫలితాన్ని డిక్లేర్ చేసే ఉత్సాహంలో కధనాలు ప్రసారం చేస్తున్నాయి. అయితే టిడిపికి అనుకూలంగా వచ్చే వార్తలను ప్రసారం చేయని జగన్ మీడియా ఛానల్ ‘సాక్షి’ ఎలాంటి కధనాలను ప్రసారం చేస్తుందన్న ఆసక్తి ఇటు టిడిపి వర్గాల్లోనూ, అటు సామాన్య ప్రజలలోనూ వ్యక్తమవుతోంది.
తెలుగుదేశం పార్టీ అనుకూలమైన అంశాలలో ‘తిమ్మిని బమ్మిని చేసే విధంగా’ ప్రసారం చేయడం ‘సాక్షి’ స్పెషాలిటి అన్నది బహిరంగమే. దీంతో నంద్యాల ఫలితం వెల్లడించే విషయంలో కూడా ఇదే రీతిన వ్యవహరిస్తుందేమోనని వీక్షకులు భావించారు. కానీ ఇది ఎన్నికల ఫలితాలు కావడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్న నేపధ్యంలో… చేసేదేమీ లేక నంద్యాల ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ లీడ్ లో ఉందని స్పష్టం చేసింది. పోలింగ్ కు ముందు రోజు ప్రసారం చేసిన కధనాలతో ఇప్పటికే ఓ కేసు నమోదు చేయించుకున్న సాక్షి, ఇప్పుడు మాత్రం ఆ సాహాసం చేయలేకపోయింది.
ఫలితాల విషయంలో చేయగలిగింది ఏమీ లేకపోవడంతో… చర్చా కార్యక్రమం పెట్టి, కేవలం టిడిపి డబ్బులు పంచడం ద్వారా మాత్రమే విజయం సాధించిందని తన నేతల చేత చెప్పించుకుంటూ కాస్త మానసిక సంతృప్తి పడుతున్నట్లుగా కనపడుతోంది. చెప్పుకోవడానికి కనీసం ఒక్క రౌండ్ లో నంద్యాల ప్రజలు అవకాశం ఇవ్వకపోవడం విశేషం. అయితే 8వ రౌండ్ నుండి భూమా బ్రహ్మానందరెడ్డి లీడ్ కాస్త తగ్గుతుండడమే హైలైట్ గా చెప్పుకుంటోంది. మొత్తానికి ‘చింత చచ్చినా… పులుపు చావలేదు…’ అన్న చందంగా జగన్ మీడియా వ్యవహరించడం ఊహించిన పరిణామమే.


