వరంగల్ వేదికగా జరిగిన “శ్యామ్ సింగరాయ్” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ పై సోషల్ మీడియాలోని నాని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు. చిత్ర ప్రధాన తారాగణం ప్రవేశించే వరకు స్టేజ్ పైన పలువురు గాన గంధర్వులు ఆలపించిన పాటలే ఈ ట్రోలింగ్ కు కారణం.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రేయాస్ గ్రూప్ ని ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేసారంటే, ఏ స్థాయిలో గాత్రికులు ప్రేక్షకులను అలరించారో అర్ధమవుతోంది. ఫైనల్ గా ‘స్టేజ్ పై నుండి దింపేయండి మహా ప్రభో’ అంటూ వేడుకోవడం కూడా జరిగింది. మరి ఆ స్థాయిలో వచ్చిన గాయనీగాయకులు ఏం చేసారు అంటే…
పాటలు పడుతున్న సమయంలో లిరిక్స్ మరిచిపోయి ఆలపించడం పట్ల నాని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అలాగే ఏ మాత్రం వినసొంపుగా లేని గాయకుల స్వరాలు బుల్లితెరపై వీక్షిస్తోన్న ప్రేక్షకులనే విసుగు తెప్పించాయంటే, ప్రత్యక్షంగా పాల్గొన్న వారి మాటేమిటి? అన్న చర్చకు కూడా దారి తీశారు.
మొత్తానికి ‘నాని అండ్ కో’ ఈవెంట్ కు వచ్చే వరకు సాగిన ఈ ట్రోలింగ్, ట్రైలర్ రిలీజ్ తో ముగింపు పడింది. హైదరాబాద్ లో కాకుండా వరంగల్ లో ఈ వేడుక నిర్వహించడం వలన ప్రొఫెషనల్ సింగర్స్ ను తీసుకెళ్లలేకపోయారని ఈ సందర్భంగా తెలుస్తోన్న విషయం. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలైనా తీసుకుని ఉండాల్సింది అన్న సూచనలు వ్యక్తమయ్యాయి.
ఇక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ‘మేమ్స్’ నాని కూడా చూస్తారని ఈ సందర్భంగా నాచురల్ స్టార్ చేసిన స్పీచ్ లో స్పష్టమైంది. ‘పుష్ప’కు ‘ఆర్ఆర్ఆర్’కు నడుమ వస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ సాండ్ విచ్ అయిపోతుందని చేసిన మేమ్ తాను చూశానని, అయితే బ్రెడ్ అందరికి ఇష్టంగా ఉంటుందని, ఈ సారి ఆశ్చర్యకరంగా కూడా ఉంటుందని అన్నారు.
“శ్యామ్ సింగరాయ్” చూసిన తర్వాత ఖచ్చితంగా 100 శాతం సంతృప్తికి అభిమానులు, ప్రేక్షకులు గురవుతారని సినిమాపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. సాయిపల్లవి డ్యాన్స్ కోసం వేచిచూస్తోన్న వారందరికీ ఓ మూడు రోజుల్లో ఓ వీడియోను రిలీజ్ చేస్తున్నామని, చాలా అద్భుతమైన డ్యాన్స్ ను మీరు చూడబోతున్నారని అన్న నాని మాటలు అభిమానులను అలరించాయి.



