ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి…మళ్ళీనా?

Nara_Chandrababu_Naidu_in_Mahanaduఒంగోలులో జరుగుతున్న మహానాడుకు ఉదయం 6 గంటల నుంచే తెలుగు తమ్ముళ్ళు తరలివచ్చి ఆప్యాయంగా పలకరింపులు, కబుర్లు, కేరింతలతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా టిడిపి నేతలు, కార్యకర్తలు హాజరవడంతో సభా ప్రాంగణమంతా నిండిపోయింది. దీంతో అనేకమంది బయటే ఉండిపోయి తమ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర ముఖ్య నాయకుల ప్రసంగాలు ఆసక్తిగా వింటూ “జై తెలుగుదేశం… జైజై చంద్రబాబు…”అంటూ నినాదాలు చేస్తూ చాలా హడావుడి చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షోపన్యాసం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. టిడిపి స్థాపించినప్పటి నుంచి మూడేళ్ళ క్రితం వరకు పార్టీ ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్ళన్నీ ఒక ఎత్తని, ఈ మూడేళ్ళ జగన్ పాలనలో ఎదుర్కొన్నవి మరో ఎత్తని అన్నారు.

ADVERTISEMENT

జగన్ ఒక అసమర్దుడని, ఆయనకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన, దూరదృష్టి లేకపోవడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దురదృష్టం అని అన్నారు. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రాన్ని అధోగతి పట్టించేశాడని మరోసారి ఇస్తే రాష్ట్రం మరిక ఎన్నటికీ కోలుకోలేదని అన్నారు. జగన్ కరెంట్ తీగ వంటివాడని తెలియక ప్రజలు ముట్టుకొని షాక్ అవుతున్నారని అన్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్రాభివృద్ధి కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చిందని కానీ జగన్ ప్రభుత్వం అభివృద్ధి మాట మరిచి సంక్షేమ పధకాలు పట్టుకొని వ్రేలాడుతున్నారని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. తనపై, టిడిపిపై కక్షతో పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు కూడా మూయించేసి సిఎం జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొట్టారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ ప్రభుత్వం ఓ పక్క వ్యవసాయానికి విద్యుత్‌ కోతలు విధిస్తూ, మళ్ళీ మోటర్లకు మీటర్లు పెట్టి రైతులను దొంగ దెబ్బ తీసేందుకు సిద్దపడుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ మీటర్లతో రైతులు చాలా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని అన్నారు.

జగన్ ప్రభుత్వం మద్యపాన నిషేదం అంటూ మొదట మద్యం ధరలు విపరీతంగా పెంచేసి వైసీపీ నేతలు దండుకొన్నారని, తరువాత మద్యం అమ్మకాలు, దాంతో ఆదాయం పెంచుకొనేందుకు మద్యం ధరలు తగ్గించి, ఇప్పుడు కూడా చీప్ లిక్కర్ అమ్ముకొని డబ్బు సంపాదించుకొంటున్నారని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు.

వైసీపీ నేతల అండ చూసుకొని పోలీస్ తదితర శాఖలలో కొందరు అధికారులు చాలా రెచ్చిపోతున్నారని, టిడిపి కార్యకర్తలను వేధిస్తున్నారని అటువంటి వారందరినీ గుర్తుంచుకొని మేము అధికారంలోకి వచ్చాక ప్రతీ ఒక్కరిపై చర్యలు తీసుకొంటామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

ముఖ్యమంత్రి పదవి తనకేమీ కొత్త కాదని కానీ రాష్ట్రం, ప్రజల కోసమే సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోరాడవలసివస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. మరికొన్ని నెలలు అందరూ ఓపిక పడితే త్వరలోనే ముందస్తు ఎన్నికలు వచ్చినా రావచ్చని అన్నారు. కనుక తమ్ముళ్లూ అందరూ కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

ADVERTISEMENT
Latest Stories