టీటీడీ అన్నప్రసాదానికి నారా దేవాన్ష్ విరాళం 33 లక్షలు

Nara_Devansh_Birthday_Donation_TTDతాత చంద్రబాబునాయుడు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపిని విజయం పదంలో నడిపించారు. ఆయన కుమారుడు టిడిపి యువనేత నారా లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజల గొంతు వినిపించేందుకు యువగళం పేరుతో జనవరి 27న కుప్పంలో పాదయాత్ర ప్రారంభించి విశేష జనాధారణతో 48 రోజులలో 600 కిమీ విజయవంతంగా పూర్తిచేశారు. నారా లోకేష్‌, బ్రాహ్మణిల ముద్దుల కుమారుడు నారా దేవాన్ష్ జన్మదినం నేడు. కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఏటా ఆలయాలలో అన్నప్రసాదం వితరణకు అతని తల్లితండ్రులు భారీగా విరాళాలు ఇస్తుంటారు. ఇవాళ్ళ మార్చి 21న నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్‌ దంపతులు కొడుకు పేరిట తిరుమల శ్రీవారి అన్నప్రసాద వితరణ కొరకు రూ.33 లక్షలు విరాళంగా అందజేశారు. ఈరోజు తిరుమల శ్రీవారి అన్నప్రసాద వితరణ కేంద్రాలలో ఈ విషయం తెలియజేస్తూ డిజిటల్ డిస్‌ప్లే బోర్డులలో ప్రదర్శించారు.

ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా, “సమాజమే దేవాలయం అని భావించే సంస్కృతిని, దానగుణాన్ని చిన్ననాటి నుండే పిల్లలకు అలవాటు చేయడం తల్లిదండ్రుల ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. టీడీపీ అధినేత, @ncbn గారి మనవడు నారా దేవాన్ష్‌ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణ కార్యక్రమం కోసం ఒకరోజుకు సరిపడా ఖర్చును… అంటే రూ.33 లక్షల భారీ విరాళాన్ని అందించారు @naralokesh, బ్రాహ్మణి దంపతులు. అంతేకాకుండా దేవాన్ష్ పేరున టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈరోజు రాష్ట్రమంతటా అన్నదానం చేస్తున్నారు,” అని ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది.

ADVERTISEMENT

ఈరోజు నారా లోకేష్‌ కదిరి నియోజకవర్గంలో 48వ రోజు యువగళం పాదయాత్రలో ఉన్నందున, కుమారుడు పుట్టిన రోజు వేడుకలలో పాల్గొనలేకపోయారు. కానీ మొటుకుపల్లి వద్ద ఆర్టీడీ ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్యాంగుల ఆశ్రమపాఠశాలను సందర్శించి, అక్కడి పిల్లలకు మిటాయిలు పంచి వారితో కాసేపు సంతోషంగా గడిపారు. కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా దారిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని కొడుకు పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం పక్కనే అన్నా క్యాంటీన్‌ని ప్రారంభించారు.

ADVERTISEMENT
Latest Stories