జగన్ ఏ విషయంలో అయితే వెనుకడుగు వేస్తారో సరిగ్గా అదే విషయంలో లోకేష్ సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న జగన్ ను టార్గెట్ చేస్తూ లోకేష్ చేసిన విమర్శనాస్త్రాలు హాట్ టాపిక్ అయ్యాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో మాట్లాడిన లోకేష్ ఓ రేంజ్ లో జగన్ పై విరుచుకు పదారు.
“ఏడేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్న చరిత్ర తమదని, ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువ ఉంటే రాసిస్తామంటూ సవాల్ చేసిన కుటుంబం తమదని, ఎవరి ఆస్తులు ఎంతనే విషయమై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, జగన్ కూడా అందుకు సిద్ధమేనా? తన ఆస్తుల ప్రకటన చేసే ధైర్యం లేని జగన్, సొంత మీడియాలో తమపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నారంటూ” మండిపడ్డ లోకేష్, దమ్ముంటే ఆస్తులను ప్రకటించాల్సిందిగా జగన్ కు సవాల్ విసిరారు.
“మీటింగ్‌లో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని జగన్, ప్రజా సమస్యలపై ఏం చర్చిస్తారని, అవిశ్వాసం పెట్టడం వైసీపీ ఎమ్మెల్యేలకే ఇష్టం లేదని, ప్రజాసమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ అని, చీటిమాటికీ అవిశ్వాసాలు పెట్టడానికి కాదని, సమస్యను పక్కదారి పట్టించేందుకే తమపై బురద జల్లుతున్నారని, చెమటలు పట్టేది మాకు కాదు, వైసీపీ వాళ్లకే” అంటూ లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
‘ఎక్కడైనా బావ గానీ, వంగతోట కాడ మాత్రం కాదు’ అన్న చందంగా… ఎలాంటి సవాల్స్ కైనా జగన్ సిద్ధమే కానీ, ఒక్క ఆస్తుల ప్రకటన తప్ప… అన్న విషయం రాజకీయ విజ్ఞులకు తెలిసిన విషయమే. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ కూడా ప్రచారంలో ఉన్నాయి. ‘అసలు ఎంత ఆస్తి ఉందో జగన్ కే తెలియదని కొందరు, జగన్ కు ఉన్న మొత్తం ఆస్తిని ప్రకటిస్తే అందరూ కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం అని మరికొందరు…’ ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సోషల్ మీడియాల వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఇదే అంశంపై సవాల్ చేసిన లోకేష్, వైసీపీ అధినేతను బాగానే ఇరుకున పెట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.



