తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర జనజాతరలా సాగుతుంది. ఐదు నెలల్లో ఇప్పటికే ఐదు ఉమ్మడి జిల్లాలు చుట్టేసి ఆరో జిల్లాలో చేస్తున్నారు, వెళ్ళిన ప్రతిచోటా జనాలు పోటెత్తుతున్నారు. తెలుగుదేశం పక్షపాతులు అని రాజకీయ ప్రత్యర్థులు విమర్శించే పత్రికలు కూడా మెుదటి రెండు నెలల తరువాత ప్రధాన కార్యక్రమాలు తప్ప మెుదటి పేజీ కవరేజ్ ఇవ్వడంలేదు. కానీ అవే పత్రికలు గతంలో వైయస్ఆర్, జగన్ చేసిన పాదయాత్రలకు ఇచ్చినంత కవరేజ్ ఇవ్వకున్నా క్షేత్ర స్థాయిలో ప్రజాస్పందన అధ్బుతంగా ఉంది. ఇక వెళ్ళిన ప్రతిచోటా ఆయా స్ధానిక ప్రజాప్రతినిధుల అవనీతి చిట్టాలు బయట పెట్టి చమటలు పట్టిస్తున్న లోకేష్ దాని ఫలితాలు కూడా చూపిస్తున్నారు. మెుదలు పెట్టిన నెల రోజులకే జరిగిన రాయలసీమ ప్రాంతంలో రెండు పట్టభద్రుల యంయల్సీ సీట్లు గెలుచుకోవడంలో యువగళం ఎఫెక్ట్ కూడా కొంత వరకు ఉండటం అందుకు నిదర్శనం.
అధికార పార్టీ నాయకులు యువగళం యాత్ర తమ ప్రాంతంలోకి వస్తుందంటేనే ఊపిరి బిగబట్టి కూర్చుంటూ, తమ ప్రాంతం దాటాక ఊపిరి పీల్చుకుంటున్నారంటేనే దాని ప్రభావం ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. అధికార పార్టీ ముఖ్యనాయకుల స్పందన ఎలా ఉన్నా ఇప్పటి వరకు జరిగిన జిల్లాలలో స్ధానిక నాయకులు మాత్రం 2024 ఫలితాల మీద ఒక అంచనాకు వచ్చేసారని వాళ్ళ సన్నిహితులు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.
ఇక విషయానికి వస్తే వైసిపి జాతీయ కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు యంపి విజయసాయి రెడ్డి హవా గత కొంత కాలంగా అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో తగ్గుతూ వచ్చింది. పార్టీలో ఆయన అధికారాలు, భాద్యతలు ఆ పార్టీ నాయకత్వం ఒక పద్దతిలో తగ్గించుకుంటూ వస్తున్న విషయం వివిధ మీడియాల్లో చర్చించడం చూస్తూనే ఉన్నారు. ఆవిషయంపై మిర్చి 9 కూడా గతంలో కొన్ని ఆర్టికల్స్ ప్రచురించింది. ముందు విశాఖ, ఉత్తరాంధ్ర భాద్యతల నుండీ తొలగించి వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు, తరువాత సోషల్ మీడియా భాద్యతలు సజ్జల భార్గవ రెడ్డికి, పార్టీ అనుబంధ విభాగాల భాద్యతలు చెవిరెడ్డికి అప్పగించారు. ఇటీవలే ఒక పార్టీ సమావేశంలో ఆ పార్టీ అద్యక్షుడు జగన్ మెూహన్ రెడ్డి కూడా ‘సాయన్న ముసలి వాడౌతున్నాడు, అందుకే ఆయన దగ్గరే అన్నీ నేర్చుకున్న భాస్కర్ రెడ్డికి ఆ భాద్యతలు అప్పగిస్తున్నా’ అంటూ అనధికారిక రిటైర్మెంట్ సూచనలు ఇచ్చారు.
జగన్ రెడ్డి ఢిల్లీ వెళితే బొకే ఇచ్చే ఫోటో తప్ప సాయి రెడ్డి పెద్దగా మీడియాల్లో ఉండటం లేదు. ప్రతిపక్ష నాయకులపై అధమ స్ధాయి భాషలో సోషల్ మీడియాల్లో విరుచుకు పడటం కూడా తగ్గిపోయింది. ఈ ఎన్నికల్లో నామమాత్రపు పాత్ర తప్ప ఇక విజయసాయి రెడ్డికి మరింక పనిలేదు అనుకుంటున్న సమయంలో యువగళం యాత్ర అధికార పార్టీ పెద్దల ఆలోచనలు తలకిందులు చేసింది. కొత్తగా ప్రాంతీయ సమన్వయ కర్తలుగా ప్రకటించిన వారిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నెల్లూరు, కడప, తిరుపతి ప్రాంతాల సమన్వయకర్త పదవికి విముఖత చూపారు. బహుశా తిరుపతి, కడపల్లో జరిగిన యువగళం యాత్ర వల్ల వాస్తవ పరిస్ధితి ముందుగా అర్దం చేసుకున్నది బాలినేనే కావొచ్చు. వాస్తవానికి సజ్జల కడప వాసి ఆయనకు ఆ భాద్యతలు ఇవ్వవచ్చు, సాయి రెడ్డి దగ్గర అన్నీ నేర్చుకున్నారన్న చెవిరెడ్డిది తిరుపతి ఆయనకైనా ఇవ్వవచ్చు, లేదా అధికారంలో నెం.2 హోదా అని చెప్పుకుంటున్న పెద్దిరెడ్డి ది చిత్తూరు ఆయనకూ ఇవ్వవచ్చు, కానీ అనధికార సమాచారం ప్రకారం వారెవరూ సిద్దంగా లేరన్నది. ఇటువంటి పరిస్ధితిలో మళ్ళీ సాయి రెడ్డే పార్టీ కి దిక్కయ్యారు. ఎటువంటి పనైనా బై హుక్ ఆర్ కుక్ సాధించుకుని వస్తారనే పేరున్న సాయి రెడ్డి కి ఈ భాద్యతలు అప్పగించారు. ఆయన కూడా పార్టీ నాయకత్వం వద్ద మళ్ళీ తన పోయిన పలుకుబడి సాధించ వచ్చుననే ఉద్దేశంతో ఈ భాద్యత తీసుకున్నట్టున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉండటం వల్ల తాము ఏమి చెప్పినా ప్రజలను నమ్మించగలిగిన ఎత్తుగడలు, ప్రజలు స్వచ్చంధంగా యువగళంకు తరలి వస్తున్న పరిస్ధితిలో ఈసారి ఫలిస్తాయా అంటే అనుమానమే.
ఏది ఏమైనా, చంద్రబాబు గారు తనకు అన్న వరస అవుతారని గతంలో ఒక సందర్భంలో సాయి రెడ్డి చెప్పారు, అలా అన్న కొడుకు పుణ్యాన సాయి రెడ్డికి మరోసారి వైసిపిలో మంచి రోజులు నచ్చినట్టున్నాయి.
-శ్రీకాంత్.సి





