టిడిపి యువనాయకుడు నారా లోకేష్ ఒకప్పుడు ప్రజల మద్య మాట్లాడేందుకు చాలా తడబడేవారు. రాజకీయ ప్రత్యర్దుల పట్ల కాస్త సున్నితంగానే చురకలు వేసేవారు తప్ప ఏనాడూ తీవ్రంగా మాట్లాడేవారు కారు. కానీ వైసీపీ నేతలు ఆయన ప్రసంగాలని ఎద్దేవా చేస్తుండటంతో నారా లోకేష్ పట్టుబట్టి తన ఉచ్ఛారణ, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చుకొన్నారు. వైసీపీ నేతల పట్ల మెతక వైఖరిని విడిచిపెట్టి చాలా దీటుగా, ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాస్త వెటకారం, వ్యంగ్యం, మాటలు, కదలికలలో కాస్త నాటకీయతని కూడా జోడించి తన ప్రసంగాలతో ప్రజలని ఆకట్టుకొంటున్నారు. అదే సమయంలో తన మాటలతో వైసీపీ నేతలకి మంటెక్కిచేస్తున్నారు. మొన్న మంత్రి రోజా స్పందన చూస్తే ఆ విషయం అర్దం అవుతుంది. మంత్రులనే కాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా లక్ష్యంగా చేసుకొని విమర్శించడానికి నారా లోకేష్ వెనకాడటం లేదు.
గురువారం యువగళం పాదయాత్రలో ప్రజలని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “ఈ ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి పేరు గజినీ అమ్మా! గజినీ కదా అందుకే చెప్పింది మరిచిపోతుంటాడు. ఒకవేళ నిజం చెప్తే గజినీ తల వెయ్యి ముక్కలైపోతుంది అందుకే గుర్తున్నా ఎప్పుడూ నిజం చెప్పడు. అనాడు ఊరూరూ తిరుగుతూ జనాలకి ఏం చెప్పాడు. నాకు 25 మంది ఎంపీలని ఇస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేకహోదా తీసుకువస్తానన్నాడు. ఆయనకి లోక్‌సభలో 19మంది, రాజ్యసభలో 9 మంది కలిపి మొత్తం 21 మంది ఎంపీలున్నారిప్పుడు. కానీ ప్రత్యేకహోదా గురించి మాట్లాడడు. ఢిల్లీ వెళితే ఆయనే గడగడలాడిపోతాడు. కేంద్ర ప్రభుత్వమే ఆయన మెడలు వంచి పడేసింది. తన సీబీఐ కేసుల మాఫీ కోసం ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టేసాడు,” అని నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు.
శుక్రవారం శ్రీకాళహస్తిలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మాట్లాడుతూ, “పవిత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో జరుగుతున్న దోపిడీ, దందాలు అన్ని నాకు తెలుసు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటన్నిటికీ చెక్ పెడతాము. శ్రీకాళహస్తి పట్టణంలో ఇంత గొప్ప దేవాలయం ఉన్నప్పటికీ పట్టణంలో రోడ్లు, కాలువల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అలాగే స్వర్ణముఖి ప్రాజెక్టుని కూడా పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను,” అని అన్నారు.



