తాడేపల్లిగూడెంలో నిన్న జరిగిన టిడిపి, జనసేనల తొలి జెండా సభ రెండు పార్టీలకు చాలా కీలకమైనది. కనుక రెండు పార్టీల నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా భావించి జెండా సభను విజయవంతం చేశారు.
ఇంత కీలకమైన సభకు టిడిపి యువనేత నారా లోకేష్ హాజరు కాకపోవడంతో, అప్పుడే వైసీపి బ్యాచ్ మసాలా దట్టించి సోషల్ మీడియాలో అందరికీ ఉచితంగా వడ్డించేస్తోంది.
టిడిపి, జనసేనల కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారని నారా లోకేష్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యారని, అప్పటి నుంచి వారిద్దరి మద్య దూరం పెరిగిందని, అందుకే నారా లోకేష్ నిన్న జరిగిన సభకు డుమ్మా కొట్టారని వాటి సారాంశం.
పవన్ కళ్యాణ్ స్వయంగా నారా లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టారు కనుక ఈ మసాలా కధలకి బలమైన బేస్ ఏర్పడింది.
అయితే నారా లోకేష్ ఈ సభకు హాజరు కాకపోవడంపై టిడిపి, జనసేన కార్యకర్తలు ఎటువంటి అనుమానాలు, అపోహలు పెట్టుకొనవసరం లేదు. ఈ సభలో పవన్ కళ్యాణ్‌కి ప్రాధాన్యం ఇస్తూ నిర్వహించాలని ముందే నిర్ణయించారు. జెండా సభ మొదటి నుంచి చివరి వరకు అదేవిదంగా సాగడం అందరూ చూశారు కూడా.
ఒకవేళ నారా లోకేష్ హాజరైతే సభకు వచ్చిన వారు, టీవీలలో ఈ సభని చూస్తున్నవారి అటెన్షన్ తప్పకుండా డైవర్ట్ అవుతుంది. అదే జరిగితే ఎంతో శ్రమించి, ఎంతో మేధోమధనం చేసి నిర్వహించిన ఈ జెండా సభ మరో మామూలు సభగా మిగిలిపోయేది.
అందుకే రెండు పార్టీలకు అత్యంత ముఖ్యమైన ఈ జెండా సభకు నారా లోకేష్ దూరంగా ఉండిపోయారు. తద్వారా ఈ జెండా సభతో టిడిపి, జనసేనలు చెప్పిన ప్రతీ విషయం సూటిగా ప్రజలకు, శ్రేయోభిలాషులకు, ప్రత్యర్ధులకు చేరింది.
అయినప్పటికీ ఎవరికైనా ఇంకా సందేహాలుంటే ఓ విషయం గుర్తు చేసుకోవడం చాలా అవసరం. యువగళం ముగింపు సభ పూర్తిగా నారా లోకేష్‌కు సంబందించింది. దాని క్రెడిట్ పూర్తిగా ఆయనకే దక్కాలి కనుకనే ఆ సభకు పవన్ కళ్యాణ్ హాజరైనప్పటికీ ఇంత లోతుగా మాట్లాడలేదు.
కానీ పవన్ కళ్యాణ్‌ని నిత్యం అవహేళన చేస్తే వైసీపి బ్యాచ్, ఆయనకు ఆ సభలో తీరని అవమానం జరిగిందంటూ వక్రీకరించే ప్రయత్నం చేయడం బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. అది వేరే విషయం.
ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్‌పై ఉండేందుకే నిన్న నారా లోకేష్ జెండా సభకు దూరంగా ఉండిపోయారు. వైసీపి బ్యాచ్ దీనినీ వక్రీకరించకుండా ఉండదు. దానినీ పట్టించుకోనవసరం లేదు. టిడిపి, జనసేనలు చాలా లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే ఇదని గ్రహిస్తే చాలు.





