శ్రీకాకుళం జిల్లాలోని ‘తిత్లీ’ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి లోకేశ్ పర్యటించారు. సహాయ చర్యలకు విఘాతం కలిగేలా కాన్వాయ్ తీసుకుని వెళ్ళకుండా మందస మండలం హరిపురంతో పాటు మరికొన్ని ఉద్దానం గ్రామాల్లో ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి బైక్‌పై ఆయన తిరిగారు. అధికారులు, సెక్యూరిటీతో ఆర్భాటం చేయ్యకుండా వెళ్లారు.
[m9ad]
లోకేష్ స్వయంగా బైక్ నడిపారు. గ్రామాల్లో బాధితులు, రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఎక్కడికక్కడ కూలిపోయిన తోటలను మంత్రి పరిశీలించారు. తుపానుతో తీవ్రంగా నష్టపోయామని తమను ఆదుకోవాలని బాధితులు లోకేశ్ ను కోరారు. తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్యం పనులు వేగవంతం అయ్యేలా అక్కడికక్కడే మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చి చర్యలు తీసుకున్నారు.
మరోవైపు తిత్లీ పెను తుపాను కలిగించిన బీభత్సంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,800 కోట్ల మేర నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం కింద రూ. 1200 కోట్లు విడుదల చేయాలని కోరారు. తిత్లీ తుపానుతో భారీగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాకు మంత్రులు, తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు.



