రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పిన మంత్రి నారా లోకేష్, తమ దృష్టంతా అభివృద్ధి వైపుకే ఉందని, అందుకు జగన్ ఉదంతమే నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో అన్ని నియోజక వర్గాలు తమకు ఒకటేనని, ఎలాంటి పక్షపాత ధోరణి ఉండదని, ఆఖరికి విపక్ష నేతల నియోజక వర్గాలకు కూడా తాము నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకు జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులే నిదర్శనమని అన్నారు.
తన నియోజక వర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రతిపక్ష నేత జగన్ ఏ ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగనప్పటికీ, తాము స్వచ్చంధంగా పులివెందులకు 10 కోట్లు కేటాయించి, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నామని, ఇందులో తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి ఏమిటో అందరికి కనపడుతుందని చెప్పారు. అధికార, ప్రతిపక్ష ధోరణి తాము చూపించడం లేదని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఉండదని ఈ సందర్భంగా నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు.
ఒక విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తోన్నది వర్తమాన రాజకీయాలకు విరుద్ధమనే చెప్పాలి. ఇప్పటివరకు ఏపీ రాజకీయాలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నవి చాలా అరుదు. ప్రతిపక్షాలు ప్రాతినిధ్యం వహించే నియోజక వర్గాలలో అధికార పక్షాలు చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తుంటాయి. ఒక్క ఏపీలోనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా ఇదే సంస్కృతి. కానీ అందుకు విరుద్ధంగా వెళ్తోన్న ‘చంద్రబాబు అండ్ కో’కు అభినందనలు తెలపాల్సిందే.


