ఈ సంక్రాంతికి మూడు సినిమాలు విడుదలయ్యాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే విడుదల కావాల్సింది నాలుగు సినిమాలు. ఆ నాలుగో సినిమా ఆర్.నారాయణమూర్తి హీరోగా నటించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ అన్న విషయం కూడా తెలిసిందే. తమకు ధియేటర్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారంటూ నారాయణమూర్తి గొంతెత్తి తన ఆవేదనను వ్యక్తపరచడంతో, మరొక సినిమా కూడా విడుదలకు సిద్ధమైందన్న విషయం ప్రేక్షకులకు అర్ధమైంది. అయితే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు టాలీవుడ్ ఇండస్ట్రీ పోకడను చీల్చిచెండాడారు.
తెలుగు సినీ పరిశ్రమలో అతి నీచమైన సంస్కృతి దాపురించినదని, తమ సినిమానే ఆడాలి, పక్కవాళ్ళ సినిమా కూడా ఆగిపోయి, ఆ కలెక్షన్ కూడా నాకే రావాలన్న దౌర్భాగ్యం ఈ తెలుగు సినీ పరిశ్రమలో ఉందని తీవ్రంగా మండిపడ్డారు. ‘ఒక మనిషి సినిమా స్క్రీన్ పైన ‘మెగాస్టార్’ కాదు, రియల్ లైఫ్ లో ‘మెగాస్టార్’లా ఉండాలి. నెల్లూరు నుండి మొదలుపెడితే ఆంధ్రా బోర్డర్ వరకు ఒక్క ధియేటర్ కూడా ఇవ్వలేదని, కనీసం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇవ్వలేదని, నీచాతినీచమైన పరిస్థితి ఉంది. నైజాంలో 23 ధియేటర్లు ఇచ్చినందుకు హ్యాట్సాఫ్ చెప్తున్నాను, ఆంధ్రాలో కనీసం ఒక్క ధియేటర్ కూడా ఇవ్వలేదు, సిఎం కూడా సిగ్గుపడాలి అంటూ ఆగ్రహంతో కూడిన వ్యాఖ్యలు చేసారు.
ఈ సినిమా విడుదల కాకపోయినా తనకేమీ కాదని, అయితే చిన్న సినిమాలకు ధియేటర్లు ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు? సినిమా హీరోగా బ్రతకడం కాదు, రియల్ గా, రియల్ హీరోగా కూడా బ్రతకడం నేర్చుకోండి. మీకు కోట్లు వచ్చాయి. ఇండియాలో ఉన్న అందరి హీరోలతో కూడా సినిమాలు తీసే స్టామినా నా దగ్గర ఉంది, సింగిల్ షెడ్యూల్ తో పూర్తి చేయగలను, అయినా మీతో సినిమాలు చేసేటంత పాపపు పని నేనెప్పుడూ చేయను. నేను చిన్న సినిమాలే తీస్తాను, మంచి సినిమాలే తీస్తాను… అంటూ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు.
చదలవాడ శ్రీనివాసరావు వ్యక్తపరిచిన ఆవేదనలో అర్ధం ఉంది. చిన్న సినిమాల నిర్మాతలు ఎప్పటినుండో గగ్గోలు పెడుతున్న విషయాన్ని మరోసారి ఏకరువు పెట్టారు చదలవాడ. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారు? అన్నదే కీలకంగా మారింది. పేరు చెప్పకపోయినా ఒక ప్రముఖ హీరోను ఉద్దేశించే అన్నారని, రెండు, మూడు సందర్భాలలో ‘మెగాస్టార్’ అంటూ వ్యాఖ్యానించడంతో చిరంజీవి పైనే ఆగ్రహం వ్యక్తపరిచారని ట్రేడ్ వర్గాల టాక్. ఈ సంక్రాంతి సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించి, కోట్లు కొల్లగొట్టిన చిత్రం కూడా ‘ఖైదీ నంబర్ 150’నే కావడంతో, మెగాస్టార్ పైనే మండిపడ్డారని జరుగుతున్న ప్రచారం.



