అంత్యక్రియలకు ముందు నిషిత్ కు పెళ్లి చేసారు!

narayana-son-nishith-final-ritesహైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియలు గురువారం నాడు నెల్లూరులోని పెన్నా నదీ తీరంలో నిర్వహించారు. సాధారణంగా శ్రీమంతుల కుటుంబాల్లోని వ్యక్తులు మరణిస్తే, తమకు చెందిన వ్యవసాయ ప్రదేశాల్లో వారికి అంత్యక్రియలు నిర్వహించి, ఆ ప్రాంతంలో స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తుంటారు. కానీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ విషయంలో అలాంటిది చోటు చేసుకోలేదు. ముందుగా నిషిత్ అంత్యక్రియలను నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించాలని భావించారు.

ADVERTISEMENT

అయితే అవివాహితుడైన నిషిత్ అంత్యక్రియలను సంప్రదాయ బద్ధంగా నిర్వహించాలని, గతంలో ప్రముఖులు కూడా అలాగే చేసుకున్నారని పండితులు తెలిపారు. దీంతో నిషిత్ ఆత్మకు శాంతి కలిగేలా… ముందుగా నివాసం వద్ద నిషిత్ కు అరటి చెట్టుతో వివాహం చేశారు. అనంతరం గాలి, నీరు, నిప్పు కలిసి ఉండే చోట భూమ్యాకాశాల సాక్షిగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇలాంటి స్థలానికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంటుందని పండితులు చెప్పడంతో పెన్నా నదీ తీరంలో తండ్రి నారాయణ చేతుల మీదుగా కొడుకు నిషిత్ అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించి, ఆ క్రతువును పూర్తి చేశారు.

ఇదిలా ఉంటే ప్రమాదానికి గల కారణాలను పోలీసులు వెలికితీసే పనిలో పడ్డారు. నిషిత్ కారు నడిపిన విధానాన్ని సీసీటీవీ కెమెరాల నుంచి సేకరించిన వివరాలతో పోలీసులు విశ్లేషించారు. రవాణా అధికారులతో కలసి నమూనా ప్రమాద ఘటనను సృష్టించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సిగ్నల్స్ నుంచి అత్యంత వేగంతో దూసుకెళ్లిన ఈ కారు కేవలం 5 సెకన్లలోనే 9వ నంబర్ పిల్లర్ ను ఢీకొట్టిందని తేల్చారు. ముందు వెళుతున్న వాహనాలను ఓవర్ టేక్ చేసుకుంటూ నిషిత్ కారు ప్రయాణించిందని చెప్పేందుకు ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్ లోని సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించారు.

అలాగే నిషిత్ కారు మెట్రో స్తంభం వైపు ఎలా వెళ్లింది? ఎందుకు వెళ్లిందన్న విషయాన్ని ఈ నమూనా ప్రమాదంతో శాస్త్రీయంగా నిర్థారించారు. తమ సమగ్ర దర్యాఫ్తులో భాగంగా, ప్రతి చిన్న విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించామని పోలీసు వర్గాలు తెలిపాయి. జూబ్సీహిల్స్ ప్రాంతంలో నిర్మితమవుతున్న మెట్రో మార్గంలో 7, 17 పిల్లర్ ల మధ్య ప్రమాద అవకాశాలు అధికంగా ఉన్నాయని, ఇక్కడ పిల్లర్లకు రేడియం స్టిక్కర్లు కూడా అంటించి లేవని గమనించామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక్కడ ప్రమాద హెచ్చరికల బోర్డును తక్షణమే ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

ADVERTISEMENT
Latest Stories