ఒకప్పుడు కాంగ్రెస్ అంటే విలువలు నాస్తి… బీజేపీకి అది జాస్తి అని చెప్పుకునే వాళ్ళు. 1999 లో వాజపేయి ప్రభుత్వం కేవలం ఒక్క ఓటు తో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది. మళ్ళీ ఎన్నికలకైనా వెళ్తా గానీ ఓట్లు మాత్రం కొనను అని ప్రకటించారు వాజపేయి.
అది గతం… ప్రస్తుతం బీజేపీ మోడీ – అమిత్ షాల చేతులలో విలువలు ఏ మాత్రం లేని ఒక వికృత పార్టీ అనడంలో ఎటువంటి అనుమానం లేదు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కి చేసిన మోసం తెలిసిందే.
తాజాగా మహారాష్ట్రలో బీజేపీ రాజకీయం మరింత చీదర గా తయారయ్యింది.
2019 లో జరిగిన ఎన్నికలలో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది. అయితే కాంగ్రెస్, శివ సేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇది అనైతిక పొత్తు అంటూ గొంతుపోయేలా అరిచారు కమలనాధులు.
సరే పక్క వారిని అనైతిక పొత్తు, అనైతిక రాజకీయం అన్నప్పుడు బీజేపీ ఎలా ప్రవర్తించాలి?
అయితే నియమాలు, విలువలు అనేది మోడీ – షా నాయకత్వంలో ఉండవు కదా!
శివసేన లో ఏకనాథ్ షిండే కి ముఖ్యమంత్రి పదవి ఎరవేసి శివసేనలో చీలిక తెచ్చి దొడ్డి దారిన అధికారంలోకి వచ్చారు.
ఆ అంకం పక్కన పెడితే… తాజాగా అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి… 30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శరద్ పవార్ పార్టీలో చీలిక తెచ్చారు.
ఏకంగా ప్రతిపక్ష నాయకుడిని తీసుకుని ఉప ముఖ్యమంత్రిని చేసి ప్రజాస్వామ్యం వర్ధిలాలి అనిపించింది బీజేపీ.
ఎన్సీపీ దేశంలోనే అత్యంత అవినీతి పార్టీలలో ఒకటి అని బీజేపీ వారు పదే పదే చెప్తారు. అయితే తమకు అవసరం అనుకున్నప్పుడు శరద్ పవార్ కు పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది కూడా ఇదే మోడీ – షా ప్రభుత్వం.
ఇప్పుడు అదే పద్మభూషణుడికి వెన్నుపోటు పొడించింది కూడా ఇదే మోడీ – షా.
అనైతిక ప్రభుత్వం అంటూ రాజకీయం మొదలుపెట్టి ఇప్పుడు శివసేన ను ముంచి సగం మందిని, ఎన్సీపీ ని తుంచి సగం మందితో దేశంలో అత్యంత పతివ్రతా శిరోమణి గా తనని తాను అభివర్ణించుకుంటుంది బీజేపీ.
కాకపోతే మనకే … “పేరుకి పతివ్రత… కానీ పది మంది మొగుళ్ళు” అని అనిపించక మానదు.



