మూడుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన చంద్రబాబు నాయుడుపై వైసీపి ప్రభుత్వం పగబట్టి వరుస కేసులు నమోదు చేస్తుంటే, దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడుకి కోర్టులలో కూడా ఉపశమనం లభించడం లేదు.
ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను రెండు రోజులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది.
ఏపీలో ఇంత జరుగుతున్నా మోడీ, అమిత్ షాలు మౌనంగా ఉన్నారంటే అర్దం ఇవన్నీ వారికీ అంగీకారమనే… వీటన్నిటికీ వారి ఆమోదం ఉందనే భావించాల్సి ఉంటుంది.
ఇందుకు బలమైన కారణమే కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్రమోడీని తీవ్రంగా వ్యతిరేకించారు. బహుశః ఆయన అదే మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడుపై ప్రతీకారంతో రగిలిపోతున్న జగన్ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చు.
తద్వారా తమ చేతికి మట్టి అంటకుండానే వారు కూడా చంద్రబాబు నాయుడుపై ప్రతీకారం తీర్చుకోగలుగుతున్నారు. బహుశః అందుకే వారిరువురూ మౌనం వహిస్తున్నట్లు భావించవచ్చు లేకుంటే జగన్ ప్రభుత్వం ఇంత దుస్సాహసానికి పూనుకోగలిగేదే కాదని చెప్పవచ్చు.
కనుక మళ్ళీ వారిరువురూ జోక్యం చేసుకొంటే తప్ప చంద్రబాబు నాయుడుకి బహుశః ఎక్కడా ఉపశమనం లభించకపోవచ్చు.
అంటే ఈ సమస్యలన్నిటికీ ‘పరిష్కార బటన్’ ఢిల్లీలోనే ఉందని భావించవచ్చు. ఈ విషయం సిఎం జగన్ ఎప్పుడో గ్రహించారు. కనుకనే అక్రమస్తుల కేసులన్నీ ఏళ్ళ తరబడి సాగుతూనే ఉన్నాయనుకోవచ్చు. వాటిలో ఆయన బెయిల్ మీద ఉండగానే ఏపీకి ముఖ్యమంత్రి కాగలిగారు. అప్పుడే నాలుగున్నరేళ్ళు రాష్ట్రాన్ని పాలించారు కూడా.
కనుక చంద్రబాబు నాయుడు కోసం టిడిపి నేతలు కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడే ప్రయత్నించుకోవలసి ఉంటుందేమో… సిఎం జగన్‌లాగ!



