ఏదైనా తప్పు లేదా పొరపాటు చేసినప్పుడు సారీ చెప్పడం సహజం. క్షమాపణ మానవ లక్షణమని ఎందరో మహానుభావులు చెప్పారు . కానీ సినిమా వ్యవహారాలకు సంబంధించి దీన్ని అంత సులభంగా ముడిపెట్టలేం. స్పై మల్టీ లాంగ్వేజ్ జరగనందుకు, ఓవర్సీస్ లో టైంకి షోలు పడనందుకు నిఖిల్ సారీ చెప్పాడు.
ఇకపై క్వాలిటీ విషయంలో శ్రద్ధ తీసుకుని ఒకేసారి అన్ని బాషల్లో రిలీజ్ అయ్యేలా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఒకరకంగా నిర్మాత మొండిపట్టుని, ప్యాన్ ఇండియా ప్రాజెక్టు ని హ్యాండిల్ చేయడంలో దర్శకుడి తడబాటుని ఒప్పుకున్నట్టే అయ్యింది. అయితే ఇది ఇతనితో మొదలైన పర్వం కాదు. ఇంకా చెప్పాలంటే ఒకరిని చూసి మరొకరు ఈ దారి పట్టేసి అలవాటుగా మార్చేలా ఉన్నారు.
వినయ విధేయ రామ డిజాస్టర్ అయినప్పుడు రామ్ చరణ్ వదిలిన ఓపెన్ లెటర్ పెద్ద చర్చకు దారి తీసింది. ఆ తర్వాత గని దారుణంగా పోయినప్పుడు వరుణ్ తేజ్ ఇదే బాట పట్టాడు. ఏజెంట్ విషయంలో అఖిల్ ఎంత హర్ట్ అయ్యాడో సోషల్ మీడియాలో అతని లేఖను చూశాక అర్థమయ్యింది. నిర్మాత అనిల్ సుంకర మూడో రోజే సరైన స్క్రిప్ట్ లేకుండా తీశామని నిజాయితీగా ఒప్పేసుకున్నారు.
ఇదంతా ఒక కోణంలో చూస్తే మంచిదే. కానీ ఏ డిజాస్టర్ అయినా సరే ప్రాధమికంగా దానికి బాధ్యత కెప్టెన్ అఫ్ ది షిప్ గా చెప్పుకునే దర్శకుడిదే. పైన చెప్పిన ఉదాహరణలు అన్నింటిలోనూ ఏ డైరెక్టర్ ఇలా బహిర్గతంగా తప్పు జరిగిందని చెప్పలేదు. అంత ఓపెన్ గా ఫెయిల్యూర్ ని ఒప్పుకుంటే రాబోయే అవకాశాలు దెబ్బ తింటాయి. బయ్యర్లను నిండా ముంచిన సినిమాలు గతంలో ఎన్నో వచ్చాయి.
ఇప్పుడింకా నయం. నాన్ థియేట్రికల్ రైట్స్ ప్రొడ్యూసర్లను కాపాడుతున్నాయి. లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఫ్లాపులు వచ్చినప్పుడు గతం గతః అనుకోవడం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు. లైగర్ పోవడం చూసే రామ్ డబుల్ ఇస్మార్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కేవలం ట్రాక్ రికార్డునే చూసుకుంటే రమేష్ వర్మకు బెల్లంకొండతో రాక్షసుడు, రవితేజతో ఖిలాడీ వచ్చేవి కాదు.
ఇలా సోషల్ మీడియా సారీలు సానుభూతి యాంగిల్ లో హీరోలు ఏ తప్పు చేయలేదనే ఫీలింగ్ కలిగించవచ్చేమో కానీ ఫైనల్ గా దానికి పని చేసిన టీమ్ మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. పోనీ అందరూ కలిసి ఒప్పేసుకుంటే అది వేరే. కానీ ఇలా హీరో ఒకడే క్షమాపణలు చెప్పే పర్వం రాబోయే రోజుల్లో ఒక ట్రెండ్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు



