పోలవరం ప్రాజెక్టు పనులను బుధవారం స్వయంగా పరిశీలించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పనులు చాలావేగంగా జరుగుతున్నాయని కితాబు ఇచ్చారు. అధికారులను, ఇంజినీర్లను, గుత్తేదారులను సయితం ప్రశంసించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా ప్రశంసలు కురిపించారు.
పోలవరం ప్రాజెక్టు సందర్శించిన అనంతరం అక్కడే భాజపా నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఈ ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తోంది. దీన్ని మనమే పూర్తి చేస్తాం. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాలి’ అని సూచించారు. అయితే ముఖ్యమంత్రిని తెగ పొగిడేసి మేమె కడుతున్నాం అని చెబితే ప్రజలు నమ్ముతారా అని వారు వాపోతున్నారు.
తాము రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతుంటే రాజకీయాలు వేరు ఇది వేరు అంటూ ముఖ్యమంత్రిని పొగిడితే ప్రజలకు ఏమని సమాధానం చెప్పగలం అని వారు వాపోతున్నారు. ఇటీవలే కేంద్రం రాష్ట్రానికి సులభతర వాణిజ్యంలో మొదటి ర్యాంకు ఇవ్వడాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు.



