తెలంగాణ ఎన్నికల ఫలితాలు: ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిన్నట్లే

USHASRI-CHARAN

నాలుగేళ్ళుగా వైసీపిలో అందరూ ‘ఆడిందే ఆట… పాడిందే పాట…’ అన్నట్లు హాయిగా గడిపేశారు. కానీ తెలంగాణ ఎన్నికల ఫలితాలు వైసీపి ఎమ్మెల్యేల జాతకాలను కూడా మార్చేశాయి. దీంతో తాడేపల్లి నుంచి ఎప్పుడు, ఎవరికి ఫోన్ వస్తుందో అని మంత్రులు, ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమని ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT

తాజాగా అనంతపురం జిల్లా వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి పిలుపులు మొదలయ్యాయి. ఒకప్పుడు టిడిపి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాని 2019 ఎన్నికలలో వైసీపి వశం చేసుకొంది జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాలు ఉండగా వాటిలో 12 వైసీపి దక్కించుకొంది. ఇక అనంతపురం వైపు చూసుకోనవసరం లేదనుకొంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తిరిగి చూసుకోక తప్పడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి (ధర్మవరం), కేతిరెడ్డి పెద్దారెడ్డి (తాడిపత్రి), మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి (ఉరవకొండ) ముగ్గురు తప్ప మిగిలిన వారందరినీ జగన్‌ మార్చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అనంత వెంకట్రామరెడ్డి (అనంతపురం), కాపు రామ చంద్రారెడ్డి (రాయదుర్గం), ఉషశ్రీ చరణ్‌ (కళ్యాణ దుర్గం), యెల్లారెడ్డిగారి వెంకట్రామిరెడ్డి (గుంతకల్లు), జొన్నలగడ్డ పద్మావతి (శింగనమల), టి, ప్రకాష్ రెడ్డి (రాప్తాడు), దో.శ్రీధర్ రెడ్డి (పుట్టపర్తి), ఎం.తిప్పేస్వామి (మడకశిర), డా.పీవీ సిద్దారెడ్డి (కదిరి), ఎం.శంకర నారాయణ (పెనుకొండ), కె. ఇక్బాల్ అహ్మద్ ఖాన్ (హిందూపురం), గోరంట్ల మాధవ్ (హిందూపురం ఎంపీ)లను మార్చి వారి స్థానంలో కొత్తవారికి ఆ సీట్లు కేటాయించడమో లేదా వారిలో ప్రజావ్యతిరేకత తక్కువగా ఉన్నవారిని వేరే నియోజకవర్గాలకు మార్చడమో చేయవచ్చని తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల జాతకాలను తారుమారు చేస్తుండటం గమనిస్తే ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్న నానుడి గుర్తుకురాకమానదు.

ప్రస్తుతం జగన్మోహన్‌ రెడ్డి కుటుంబం క్రిస్మస్, న్యూఇయర్ హడావిడిలో ఉన్నందున తాత్కాలికంగా తాడేపల్లి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు పిలుపులు ఆగిపోయాయి. కానీ సంక్రాంతిలోగానే జగన్ ఎమ్మెల్యేల సంగతి తేల్చేయవచ్చు. కనుక భోగీ మంటల్లో సమిదలయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు?సంక్రాంతి పండుగ జరుపుకొనేది ఎవరో?

ADVERTISEMENT
Latest Stories