వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మార్పులు చేర్పులతో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలే కాదు మంత్రులు కూడా నైరాశ్యంలో కూరుకుపోతున్నారు. ఇటీవల మంత్రి రోజా తనకు టికెట్ ఇవ్వకపోయినా జగన్ వెంటే నడుస్తానంటూ తనకు టికెట్ రాదనే విషయం స్వయంగా బయటపెట్టుకోగా, తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూడా నైరాశ్యంతో మాట్లాడి తనకీ టికెట్ రాకపోవచ్చునని బయటపెట్టుకొన్నారు.
సత్తెనపల్లి పట్టణంలో నిన్న వంగవీటి రంగా వర్ధంతి సభ జరిగింది. దానిలో పాల్గొన్న మంత్రి అంబటి, “వంగవీటి రంగా, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి ప్రముఖులు ఎందరో చనిపోయారు. ఏదో రోజు మనమూ చనిపోతాము. ఎల్లకాలం ఎవరు బ్రతికి ఉండరు కదా?
మన జీవితమే శాశ్వితం కానప్పుడు ఈ పదవులు, అధికారం ఎల్లకాలం ఉంటాయని ఎలా అనుకోగలము?పదవుల కోసం ప్రాకులాడేవాడిని సమాజం క్షమించదు. నేను ఎన్నడూ పదవుల కోసం ఆరాటపడలేదు. నా సామర్ధ్యం చూసే జగన్మోహన్ రెడ్డి నాకు 2019లో ఎమ్మెల్యే టికెట్, తర్వాత ఈ మంత్రి పదవి ఇచ్చారు. మళ్ళీ అవకాశం ఇస్తే సంతోషం. ఇవ్వకపోయినా సంతోషమే. ఇటువంటి వాటికి నేను అతీతం. నాకు మళ్ళీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తాను,” అని అన్నారు.
రాజకీయాలలో ఉన్న ప్రతీ ఒక్కరూ పదవి, అధికారం కోసమే ప్రాకులాడుతుంటారని అందరికీ తెలుసు. కానీ అంబటి వంటివారు కాదని చెపితే ఎవరూ నమ్మరు.
అసలు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు వైసీపిలో ఈ మార్పులు చేర్పులు ఎందుకు చేస్తున్నారు?సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు లక్షల కోట్లు ఎందుకు పంచిపెడుతున్నారు?టిడిపిని అడ్డుతొలగించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? టిడిపి, జనసేనలు కలవకూడదని ఎందుకు కోరుకొంటున్నారు?అంటే రాబోయే ఎన్నికలలో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అవుదామనే తాపత్రయంతోనే కదా?
కానీ మాకెవరికీ అటువంటి తాపత్రయం లేదని రోజా, అంబటి వంటివారు చెపుతున్న ఇటువంటి మాటలు నమ్మశఖ్యంగా ఉన్నాయా?నిజానికి జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికే అంబటి రాంబాబు నిత్యం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లని ఉద్దేశ్యించి చాలా చవుకబారుగా మాట్లాడుతున్నారని, అందుకే టిడిపి, జనసేనలని నిత్యం విమర్శిస్తుంటారని అందరికీ తెలుసు.
అయినా జగన్మోహన్ రెడ్డి తనని పక్కన పెట్టబోతున్నారనే ఆందోళన, నైరాశ్యం ఆయన మాటలలోనే వినిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి వైసీపి నేతలకి వేరే దారి లేదు కనుక ఇంకా జగన్ వెంటే నడుస్తామని చెప్పుకొంటున్నప్పటికీ, వైఎస్ షర్మిల వచ్చి కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బిరబిరా పరుగులు తీయడం ఖాయమే. ఇప్పటికే కొందరు టిడిపి, జనసేనలతో టచ్‌లో ఉన్నారు కూడా.
అయితే అంబటి రాంబాబుకి ఈ అవకాశం లేదు కనుక ఉంటే వైసీపిలో పడి ఉండాలి లేదా వైఎస్ షర్మిల వచ్చి కాంగ్రెస్ తలుపులు తెరిచేవరకు ఓపికగా ఎదురుచూడాల్సిందే!




