
సుదీర్ఘ రాజకీయ అనుభవం, 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం, పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది కార్యకర్తల బలం, నారా, నందమూరి కుటుంబాల మీద అభిమానం, పార్టీనే నమ్ముకుని నడిచే వందలాది నాయకులు….ఇలా టీడీపీ పార్టీ కి ఒక బలమైన రాజకీయ చరిత్రే ఉంది.
పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఒక పక్క, మరో నలభై ఏళ్ళ రాజకీయ భవిష్యత్ ఉన్న నాయకుడు మరో పక్క ఇలా టీడీపీ పార్టీకి గతం, వర్తమానం, భవిష్యత్ అన్ని కూడా మిండుగా కనిపిస్తున్నాయి. అయితే రాజకీయంగా క్షేత్ర స్థాయిలో ఇంతలా బలంగా ఉన్న పార్టీ కూడా ఒక్కో సందర్భంలో రాజకీయ అనిచ్చితి ఎదుర్కొంటుంది. అలాగే ఒక్కో ప్రాంతంలో పార్టీ ఉనికి కొసం పోరాడుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో టీడీపీ అటు తెలంగాణ ఇటు ఆంధ్రా, రాయలసీమ ఇలా మూడు ప్రాంతాలలో కూడా చాల బలమైన ముద్ర వేసింది. బాబు తన నాయకత్వ పటిమతో, హైద్రాబాద్ అభివృద్ధి మంత్రంతో తెలంగాణలో టీడీపీ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, బాబు పట్ల ఒక విశిష్ట గౌరవం ఉండేది.
ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం హైద్రాబాద్ అభివృద్ధిలో బాబు వేసిన పునాదిని ఇప్పటికి కీర్తిస్తూనే ఉంటారు. అయితే అలా అటు తెలంగాణలో ఇటు ఏపీలో సమానమైన బలంతో ఉండే టీడీపీ రాష్ట్ర విభజనతో, రెండు కళ్ళ సిద్ధాంతంతో, కేసీఆర్ రాజకీయ చేతురతతో ప్రస్తుతానికి తెలంగాణలో టీడీపీ కనుమరుగయ్యింది.
ఇక ఇటు ఏపీ విషయానికొస్తే, 2014 లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ, ప్రభుత్వ పనులతో, రాష్ట్ర పునరానిర్మాణ బాధ్యతలతో, రాజధాని అభివృద్ధితో, పోలవరం పై పట్టుదలతో పార్టీ బాధ్యతలను పూర్తిగా విస్మరించారు. అటు ముఖ్యమంత్రిగా బాబు, ఇటు ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ ఎవరి పనులలో వారు బిజీగా ఉండడంతో అసలు పార్టీలో ఏం జరుగుతుంది.?
క్యాడర్ పార్టీ నుండి ఏం కోరుకుంటున్నారు.? పార్టీ కోసం కష్టపడుతున్న నేతలెవరూ.? పార్టీ పదవుల కోసం ఆరాటపడుతున్న నాయకులెవరు.? అన్న విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసారు అధిష్టానం. దీనితో అటు పార్టీ క్యాడర్లకు ఇటు పార్టీ లీడర్లకు మధ్య గ్యాప్ రావడం, ఆ గ్యాప్ ను ప్రత్యర్థి వైసీపీ సక్రమంగా వినియోగించుకోవడం జరిగిపోయింది.
Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?
దాని ఫలితమే 2019 ఎన్నికల ఫలితాలు. అయితే 2024 లో తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈసారి పార్టీ నుంచి ఆ తప్పు జరగకుండా చూసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అందుకు గాను స్వయంగా వారంలో ఒక రోజు పార్టీ కోసం, పార్టీ క్యాడర్ కోసం వెచ్చిస్తున్నారు బాబు.
అసలు ఒకరకంగా చెప్పాలంటే ఈసారి కూటమి ప్రభుత్వ క్యాబినెట్ లో నారా లోకేష్ ఉండరు, ఆయన పూర్తిగా పార్టీ పటిష్టత పై ఫోకస్ పెడతారు, పార్టీ భవిష్యత్ నాయకుడిగా పార్టీ పై పూర్తి పట్టు సాధిస్తారు అనే పుకార్లు కూడా పలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే క్షేత్ర స్థాయిలో, నాయకుల స్థానంలో, నాయకత్వంలో ఈ స్థాయి బలం, బలగం ఉన్న టీడీపీ కూడా అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయం చేసుకుటానికి తడబడుతుంటే,
ఇక జనసేన అంటే పవన్, పవన్ అంటే జనసేన అనే విధంగా ఉండే జనసేన పరిస్థితి ఎలా ఉండబోతుంది. పార్టీ పెట్టి 11 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటికీ పట్టుమని 11 మంది జనసేన నాయకుల పేర్లు కూడా సామాన్య ప్రజానీకానికి టక్కున గుర్తురావు. 2024 ఎన్నికలలో 21 కి 21 నెగ్గినప్పటికీ ఇప్పటికి జనసేన అంటే కేవలం పవన్ మాత్రమే కనిపిస్తారు, పవన్ మాత్రమే వినిపిస్తారు.
జనసేనలో పవన్ ను మినహాయించి మరో నేత పేరు చెప్పమంటే వినపడే పేరు నాదెండ్ల మనోహర్. అయితే ఈయనకు ప్రజలలో జనసేన నేతగా గుర్తింపు దక్కింది గాని కావాల్సినంత రాజకీయ చరిష్మా మాత్రం అందలేదు. అయితే తాజాగా జనసేన ఎమ్మెల్సీ గా ఎన్నికైన పవన్ సోదరుడు నాగబాబు కూడా పవన్ కు ప్రత్యమ్నాయంగా కనిపించరు.
జనసేన పార్టీ నుంచి బహిరంగ సభలు నిర్వహిస్తే ఆ సభలో పవన్ లేకపోతే ఆ మీటింగ్ లపై అటు మీడియా అటెన్షన్ కానీ ఇటు పార్టీ క్యాడర్ అటెండన్స్ కానీ కనిపించదు. అటువంటి పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో భాగమయ్యింది. ఇటు పార్టీ అధినేత పవన్ డిప్యూటీ సీఎం గా, ఐదు కీలక శాఖల మంత్రిగా పాలనలో బిజీగా ఉంటూనే అటు సినిమాలలోనూ నటిస్తున్నారు. అలాగే ఇటు సోదరుడు నాగబాబు కూడా ఎమ్మెల్సీ తో మంత్రి వర్గంలో చేరే అవకాశం ఉంది.
ఇలా రెండు పడవల మీద ఏకకాలంలో ప్రయాణం చేస్తున్న పవన్ కు పార్టీని పటిష్టం చేసే అవకాశం కానీ, పార్టీ కొత్త నాయకత్వాన్ని గుర్తించే సమయం కానీ ఉంటుందా.? ఆలాగే ఇటు పార్టీ క్యాడర్ మనోగతాలు పవన్ వరకు చేరే అవకాశం వస్తుందా.? అసలు క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి ఏంటీ.? భవిష్యత్ కార్యాచరణ ఎలా అన్న అంశాల మీద క్యాడర్ తో స్థానిక లీడర్లతో చర్చించేంత సమయం పవన్ కు లభిస్తుందా.?
అలాగే ప్రత్యర్థి పార్టీ రాజకీయ వ్యూహాలకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టగలిగే నాయకత్వాన్ని పవన్ సృష్టించుకునేదెప్పుడు.? దాన్ని క్షేత్ర స్థాయిలో బలపరిచేది ఎప్పుడు.? అటు పవన్ అటు నాగబాబు ఇద్దరు కూడా మంత్రి పదవులతో క్యాబినెట్ లో ఉంటే పార్టీ ని చూసుకునే ఆ అదృశ్య శక్తి ఎవరు.? పవన్ కు అపారమైన అభిమాన బలం ఉంది. ఆ అభిమానాన్ని పార్టీకి ఓటు బ్యాంకు గా మలచుకోగలగాలి.
2024 ఎన్నికల ప్రచారంలోనే జనసేనకు అపారమైన అభిమాన బలం ఉంది కానీ కావాల్సినంత రాజకీయ బలం లేదు అంటూ పవన్ వ్యాఖ్యానించారు, కనీసం పార్టీ తరపున పోలింగ్ బూత్ నిర్వహించగలిగిన సమర్ధవంతమైన నాయకత్వం కూడా జనసేనకు లేదంటూ నాడు ప్రకటించి టీడీపీ తో పొత్తుకెళ్లిన పవన్ రేపటి రోజున ఒంటరిగా నిలబడగల విధంగా పార్టీని పటిష్టం చెయ్యగలుగుతారా.?
ఇటు రాజకీయంగా పాలనలో తన మార్క్ చూపించాలి, అటు సినిమాలతో తన నటనతో అభిమానులను అలరించాలి, అదే విధంగా పార్టీ అధినేతగా పార్టీ వర్తమానం, భవిష్యత్ బాధ్యతలను చేపట్టాలి. ఇలా పవన్ రెండు కాదు మూడు పడవల మీద ప్రయాణం చెయ్యక తప్పని పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా జనసేనకు సాధ్యమేనా.? ఇక తెలంగాణలో జనసేన ప్రయాణం గురించి పవన్ ఇప్పుడే ఆలోచించక పోవడం అత్యుత్తమమనే చెప్పాలి.