‘ఏదైనా చేయి దాటితేనే దాని విలువ తెలుస్తుంది’ అనే విషయం ప్రస్తుతం ఇండియన్స్ బాగా తెలిసి వస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో అవి మన జీవితంలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో ప్రతి ఒక్కరికి తెలిసొచ్చింది. వ్యాపారాలు లేక వెలవెలపోతున్న దుకాణాలు… పనులు లేక ఖాళీగా ఉన్న రోజు వారి కూలీలు… నిత్యావసర సరుకులు అoదుబాటులో లేక విలవిల లాడుతున్న సామాన్యులు… నల్ల డబ్బు ఎలా మార్చాలో తెలియక తలలు పట్టుకున్న బడాబాబులు… ఇలా ఒక్కరేమిటి ఎవరికి వారు వారి స్థాయికి తగ్గట్టు ఇక్కట్లు పడుతూనే ఉంటున్నారు.
“కాదేది కవితకనర్హం” అని మహాకవి “శ్రీ శ్రీ” గారు అన్నట్లు “డబ్బు దెబ్బకు కాదేది మినహాయింపు” అని ‘ఉల్లి –ఉప్పు’ ఇలా అతి సామాన్య వస్తువులు కూడా కొండెక్కి కూర్చున్నాయి. ఈ పెద్ద నోట్ల రద్దు భారం ‘ఉప్పు- ఉల్లి’ రెండూ కూడా మోయలేనంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ‘ఉప్పు – ఉల్లి’ రెండు ప్రజలను కంటతడి పెట్టించడానికి సిద్ధమయ్యాయి. తెలంగాణా హైదరాబాద్ లో, ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఈ రెండు వస్తువులు జనాలకు ఘాటు పుట్టిస్తున్నాయి.
వ్యాపారుల మాయజాలo కావచ్చు లేక నోట్ల రద్దు భారం కావచ్చు, ప్రస్తుతానికి ఈ రెండు అలిగి అరపెక్కి కూర్చున్నాయి. ప్రభుత్వాలు బుజ్జగిస్తేనే ఇవి కిందకి దిగుతాయి. మరి మన ప్రభుత్వాలు ఎలా బుజ్జగిస్తాయో వేచిచూడాలి. ఈ బుజ్జగింపుల పర్వం కూడా హెచ్చరికల రూపంలో ఉండాలి. లేదంటే మరికొన్ని నిత్యావసర వస్తువులు కూడా, ఇలా అలక బూనడం ఇప్పుడు మా వంతు అంటాయి.



