జూలై 16వ తేదీ నుండి జూనియర్ ఎన్టీఆర్ “బిగ్ బాస్” షో ప్రసారం కానుందన్న విషయం ఖరారైంది. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30 నిముషాలకు, శని, ఆది వారాలలో 9 గంటలకు ప్రసారం కానున్నట్లు షెడ్యూల్స్ ను కూడా ప్రకటించేసారు. అలాగే ఒక పెద్ద హౌస్, 70 రోజులు, 60 కెమెరాలు, 12 మంది సెలబ్రిటీలు ఇందులో భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏమిటంటే… ఇంతవరకు అధికారికంగా ఏ ఒక్క సెలబ్రిటీ పేరు కూడా ప్రకటించలేదు.
దీంతో జూనియర్ ఎన్టీఆర్ షోలో పార్టిసిపెంట్ చేయనున్న ఆ 12 మంది ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో ఒకరైతే ధనాధన్ ధన్ రాజ్ ఖరారైంది. ఇటీవల్ ఇంటర్వ్యూలో 71 రోజుల పాటు తను ఓ కార్యక్రమానికి వెళ్ళబోతున్నట్లుగా ప్రకటించడంతో, ధన్ రాజ్ ఇందులో ఉన్నాడని మాత్రం స్పష్టమైంది. అలాగే ‘ఐస్ క్రీం’ పాప తేజస్వి కూడా సైన్ చేసిందన్న సమాచారం ఉంది గానీ, అధికారికం కాలేదు. ఇంకా మరికొందరి పేర్లు హల్చల్ చేస్తున్నాయి గానీ, ఎవరిపై పక్కా సమాచారం లేదు.



