కోతికి కొబ్బరికాయ.. పాక్‌ చేతిలో అణ్వాయుధాలు..

nuclear-arms-in-pakistan-dangerous---rajnath-singh

భారత్‌-పాక్‌ మద్య ఉద్రిక్తతలు మొదలైనప్పుడు, ఎంతో బాధ్యతగా సంయమనంతో మాట్లాడాల్సిన పాక్‌ మంత్రులు, సైన్యాధికారులు భారత్‌పై అణుబాంబులతో దాడి చేస్తామంటూ కరడుగట్టిన ఉగ్రవాదుల్లా బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ నేటికీ భారత్‌ మంత్రులు, సైన్యాధికారులు ఎవరూ కూడా పాక్‌పై అణ్వస్త్రాల ప్రయోగిస్తామని బెదిరించలేదు. కనీసం అణ్వస్త్రాల ప్రస్తావన కూడా చేయడం లేదు.

ADVERTISEMENT

అణ్వస్త్రాల విషయంలో భారత్‌-పాక్‌ మద్య ఈ తేడాని యావత్ ప్రపంచదేశాలు గమనించాలని రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న పాక్‌ అధీనంలో అణ్వాయుధాలు ఉండటం ఎప్పటికైనా ప్రమాదకరమే కనుక అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పాక్‌ నిలువ చేసుకున్న అణ్వాయుధాలను తన అధీనంలోకి తీసుకోవాలని రాజ్‌నాధ్ సింగ్‌ విజ్ఞప్తి చేశారు.

ఉగ్రవాదుల చేతుల్లో భర్తలను కోల్పోయిన భారతీయ మహిళలకు న్యాయం చేసేందుకే భారత్‌ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్‌ చేపట్టింది తప్ప పాక్‌తో యుద్ధం చేసేందుకు కాదని రాజ్‌నాధ్ సింగ్‌ స్పష్టం చేశారు. కనుకనే ఆ ఆపరేషన్‌లో భారత్‌ దళాలు ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశాయి తప్ప పాక్‌ సైనిక స్థావరాలపై దాడులు చేయలేదన్నారు.

కానీ పాక్‌ అందుకు ప్రతీకరంగా భారత్‌ సైనిక, వైమానిక స్థావరాలపై దాడులు చేసిందని, దానిని యుద్ధ చర్యగానే పరిగణించాల్సి వచ్చిందన్నారు. అందువల్లే భారత్‌ కూడా పాక్‌ సైనిక, వైమానిక స్థావరాలపై దాడులు చేయాల్సి వచ్చిందని రాజ్‌నాధ్ సింగ్‌ అన్నారు.

ఇటీవల ప్రధాని మోడీ పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించగా, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ నేడు జమ్ము కశ్మీర్‌ చినార్ కోర్ వద్ద గల ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఆర్మీ జవాన్లతో మాట్లాడారు.

భారత్‌ ప్రధాని, రక్షణ మంత్రి దేశ సరిహద్దుల వద్ద తమ సైనిక, వైమానిక స్థావరాలను సందర్శించడం, అక్కడ సైనికులతో మాట్లాడుతున్న మాటలు, ఫోటోలు పాక్‌తో సహా యావత్ ప్రపంచదేశాలు చూస్తున్నాయి.

కానీ పాక్‌ ప్రధాని, రక్షణ మంత్రి, సైన్యాధికారులు తమ దేశ ప్రజలకు మొహాలు చూపలేక తమతమ కార్యాలయాలలోనే కూర్చొని ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నారు.

పాక్‌ వద్ద అణ్వాయుధాలు ఉంచడం అంటే కల్లు తాగిన కోతి చేతిలో కొబ్బరికాయ వంటిదే. అదెప్పుడు ఎవరిపై విసిరి కొడుతుందో ఎవరికీ తెలియదు. కనుక ఉగ్రవాదులకి పింఛన్లు, నష్టపరిహారాలు చెల్లిస్తున్న పాక్‌ ప్రభుత్వం చేతిలో అణ్వాయుధాలు ఉండటం చాలా ప్రమాదకరమనే రాజ్‌నాధ్ సింగ్‌ సూచనని డోనాల్డ్ ట్రంప్‌, ప్రపంచదేశాల చెవికి ఎక్కుతాయా?ఒకవేళ ఎక్కినా పాక్‌ అందుకు అంగీకరిస్తుందా?అంటే అనుమానమే.

ADVERTISEMENT
Latest Stories