ఏడాది పాలన: 164 కాదు..ఆ రెండే కీలకం..!

Pawan Kalyan Nara Lokesh

కూటమి ప్రభుత్వం తన ఏడాది పాలనను ముగించుకుని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండిటికి సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతుంది. అయితే వై నాట్ 175 నినాదంతో వైసీపీ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తే, కూటమి పార్టీలకు 164 సీట్లు కట్టబెట్టి వైసీపీ కి ఊహించని షాక్ ఇచ్చారు ఏపీ ప్రజలు.

అయితే ఈ ఏడాది పాలనలో కూటమి గెలుపొందిన 164 నియోజకవర్గాలకు గాను మొదటిసారి ఎమ్మెల్యే గా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఇద్దరి నాయకుల నియోజకవర్గాల అభివృద్ధి పై అందరి ద్రుష్టి కేంద్రీకృతమవుతుంది.

ADVERTISEMENT

ఆ ఇద్దరిలో ఒకరు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే, మరొకరు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అటు ప్రభుత్వంలోను ఇటు నియోజకవర్గంలోను ఈ ఇద్దరు తమ మార్క్ అభివృద్ధి చూపించారా అనేది ఇప్పుడు చూద్దాం.

ముందుగా లోకేష్ విషయానికొస్తే, 2019 ఎన్నికలలో ఓటమికి తోడు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు టీడీపీ జెండా ఎగరని మంగళగిరిలో ప్రత్యర్థి వైసీపీ మీద దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది తనకు ఎదురైనా ఎన్నో అవమానాలకు, అవహేళనలకు 2024 ఎన్నికలలో గట్టి బదులు చెప్పారు నారా లోకేష్.

ఎన్టీఆర్ మనవడిగా, చంద్రబాబు తనయుడిగా, టీడీపీ పార్టీ భవిష్యత్ నాయకుడిగా లోకేష్ గెలుపు అనివార్యం అయ్యింది. అటు సొంత పార్టీ కార్యకర్తల నుంచి ఇటు ప్రత్యర్థి పార్టీల నాయకుల వరకు అందరి కళ్ళు లోకేష్ వైపే అన్నట్టుగా మంగళగిరి రాష్ట్రంలో ఒక కీలక నియోజకవర్గంగా మారింది.

ఇక పవన్ కళ్యాణ్ అంశానికొస్తే, జనసేన పార్టీ అధినేతకు తోడు సినీ పరిశ్రమలో పవన్ కు ఉన్న స్టార్ ఛరిష్మా ఆయన రాజకీయ పయనం పై ప్రజలలో అంచనాలను పెంచింది. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో పవన్ తన తొలి అడుగులో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. పోటీ చేసిన రెండు స్థానాలలో ను అపజయాన్ని మూటకట్టుకున్నారు.

దీనితో వైసీపీ అవమానాలను తట్టుకుని, అవహేళనను ఎదుర్కొని తిరిగి బై బై వైసీపీ అంటూ యుద్ధం మొదలుపెట్టారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తుపెట్టుకుని పిఠాపురం వేదికగా ఎమ్మెల్యే గా తన తొలి గెలుపు అందుకున్న పవన్ పంచాయితీ శాఖతో పాటు మరికొన్ని శాఖలకు మంత్రిగా, ఏపీ డిప్యూటీ సీఎం గా వైసీపీ ఊహించని స్థాయికి చేరుకున్నారు.

దీనితో కూటమి గెలిచిన 164 సీట్లతో అటు నారా లోకేష్ మంగళగిరి, ఇటు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాలు ఎలా మారబోతున్నాయి అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే లోకేష్, పవన్ మీద ఉన్న భారీ అంచనాలను నిలబెట్టుకోవడానికి ఇటు మంగళగిరి లో లోకేష్ కానీ అటు పిఠాపురంలో పవన్ గాని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటుగా తమ వ్యక్తిగత ఖాతాల నుంచి కూడా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు.

మంగళగిరి విషయానికొస్తే, అక్కడి పేద ప్రజల దశాబ్దాల కల శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమాన్ని “మన ఇల్లు మన లోకేష్” పేరు మీద లోకేష్ దిగ్విజయంగా పూర్తి చేసి స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు అందుకున్నారు. ఇక రాష్ట్రంలోనే తన నియోజకవర్గాన్ని నెంబర్ 1 గా నిలపడానికి స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం తో పాటుగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసారు.

అలాగే మంగళగిరిలో ఎకో పార్క్ రుసుమును పూర్తిగా రద్దు చేస్తూ అందుకుగాను తన సొంత సొమ్మును చెల్లిచేందుకు సిద్ధపడ్డారు. ఇక నిత్యం తన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం “ప్రజా దర్బార్” నిర్వహిస్తూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక మంగళగిరి బ్రాండ్ అయిన చేనేత కు మంచి ప్రోత్సహకాలు కల్పిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.

ఇక పిఠాపురం సంగతికొస్తే, సుమారు 70 వేల ఓట్ల మెజారిటీతో పిఠాపురం ప్రజల మద్దతు సంపాదించిన పవన్ అందుకుగాను వారి ఋణం తీర్చునేందుకు దేశంలోనే పిఠాపురం నియోజవర్గాన్ని ఒక ఆదర్శంగా తీర్చి దిద్దుతానంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయా అంటే, ఆధ్యాత్మిక టూరిజం, మినీ గోకులం, 30 పడకల సిహెచ్సీ ని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు.

ఇక ఎమ్మెల్యే గా ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న జీతం మొత్తం తల్లిదండ్రులు లేని చిన్నారులకు ఒక్కొక్కరికి 5 వేలు చొప్పున కేటాయిస్తున్నారు. ఇలా అటు మంగళగిరి, ఇటు పిఠాపురం రెండు కూడా అభివృద్ధిలో పోటీ పడుతూ, లోకేష్, పవన్ ఇద్దరు భవిష్యత్ నాయకులుగా ఎదగడానికి అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

మంగళగిరిలో లోకేష్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో, మిత్ర పక్షాలను కలుపుకుపోతున్న విధానాలతో మంగళగిరి టీడీపీ కంచుకోటగా, లోకేష్ అడ్డాగా మారిపోయింది. అలాగే పవన్ పిఠాపురం కూడా గతం తో పోలిస్తే అభివృద్ధి అనేది కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉండడంతో పిఠాపురం ఈ విషయాలలోనే ఎక్కువగా వార్తలలో నిలవడం కాస్త విస్మయానికి గురి చేస్తుంది.

ఏది ఏమైనప్పటికి ఈ ఇద్దరు ఎమ్మెల్యే గా తమ మొదటి అడుగు వేసిన రెండు నియోజకవర్గాలు అభివృద్ధిలో దూసుకెళ్లడం, రాష్ట్ర ప్రగతికి తోడ్పడం అభినందనీయం.

ADVERTISEMENT
Latest Stories