2019 లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఈ మేరకు 2019 ఫిబ్రవరి 25న ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆ మేరకు మొదటి విడత ఎన్నిక ఏప్రిల్ 10వ తేదీ తర్వాత జరిగే అవకాశాలున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ 2014 మార్చి 5వ తేదీన విడుదల కాగా, ఎన్నికలు 9 విడతలుగా ఏప్రిల్ 7– మే 12వ తేదీల మధ్యలో జరిగాయి.ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ తో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడే అవకాశం ఉంది.
[m9ad]
ఒకవేళ అదే జరిగితే ఎన్నికల ముందు కొత్త పథకాలు ప్రవేశ పెట్టడానికి గానీ ఏదైనా కీలకమైన విధానపరమైన నిర్ణయాలు వెలువరించడానికి గానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే రాష్ట్రంలో ఎన్నికల మూడ్ వచ్చేస్తుంది. ఆ తరువాత నోటిఫికేషన్ విడుదల అయితే ఎన్నికల కోడ్ కూడా అమలు లోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి లోగానే చంద్రబాబు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసుకోవాలి.
అదే క్రమంలో రుణ మాఫీకి సంబంధించిన చివరి రెండు వాయిదాల సొమ్ములు కూడా ప్రజలకు చెల్లించాలి. ఈ సారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తిగా ఉండబోతున్నాయి. ఈ సారి టీడీపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్, జనసేన మధ్యలో త్రిముఖ పోటీ జరగబోతుంది. అదే క్రమంలో చంద్రబాబు నాయుడును తిరిగి అధికారంలోకి రానివ్వడం కోసం బీజేపీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఎంఐఎంలు కూడా తమ వంతు పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నాయి.
అఖండ మెజారిటీతో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడంలో పలు ప్రజాకర్షక పథకాలు కీలక పాత్ర పోషించాయి. తెలంగాణాలో విజయవంతమైన రైతు బంధు పధకం ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకుని రావాలని చంద్రబాబుపై ఒత్తిడి ఉండగా, క్లిష్టమైన రాష్ట్రం ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా అదంతా తేలిక కాబోదని విశ్లేషకుల అంచనా. ఈ క్రమంలో తిరిగి అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు ఏం చెయ్యబోతున్నారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.



