Padayatra or Jailyatra Jagan Mohan Reddy

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం డొంక మొత్తం తాడేపల్లి ప్యాలస్ వైపే దారిని చూపిస్తున్నాయని, రేపో మాపో ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ కూడా అరెస్టు కాబోతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

అయితే ఆ ఊహాగానాలను బలపరిచే మాదిరే వైసీపీ నేతలు కూడా మీడియాలో మాట్లాడుతూ అందుకు పార్టీ క్యాడర్ ను సైతం సిద్ధం చేస్తున్నారు. మాజీ మంత్రులు పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు ఈ మధ్య తరచుగా వైస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టు పై వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read – జగనన్న రాజకీయ ప్రవచనాలు…

జగన్ సన్నిహితులు మాజీ ముఖ్యమంత్రి కార్యదర్శి, రిటైర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి లు లిక్కర్ కేసులో అరెస్టైన తరువాత వైసీపీ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీనితో అతిత్వరలో వైసీపీ లో మరో సంక్షోభం రానుంది అనేలా మాజీ మంత్రులంతా పార్టీ కార్యకర్తలను మానసికంగా సిద్ధం చేస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నారు.

జగన్ కు కేసులు, అరెస్టులు, జైళ్లు కొత్తేమి కాదు అంటూ ఒకరు, కూటమి ప్రభుత్వం జగన్ అరెస్టు కోసం మద్యం కేసులో అరెస్టయిన వారితో జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలను సృష్టిస్తుంది అంటూ మరొకరు ఇలా భవిష్యత్ లో జగన్ అరెస్టు తప్పదు అనేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.

Also Read – యావత్ దేశం దృష్టి విశాఖ పైనే…

అయితే ఇలా మాజీ ముఖ్యమంత్రి జగన్ లిక్కర్ కేసులో అరెస్టయ్యి జైలుకెళ్లోస్తే ఆయన మీద ప్రజలలో సానుభూతి వచ్చి వైసీపీ కి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా.? అనే రాజకీయ చర్చ కూడా ఏపీలో విస్తృతంగా జరుగుతుంది.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయ్యి దాదాపు కొన్ని నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. ఆ తరువాత ఢిల్లీ ఎన్నికల సమయం నాటికి బైలు మీద బయటకొచ్చిన కేజ్రీవాల్ తన నొర్దోషత్వాన్ని ప్రజా కోర్టులోనే తేల్చుకుంటా అంటూ సవాల్చేసి మరి ఎన్నికలకు వెళ్లారు.

Also Read – ఫోన్ ట్యాపింగ్: ఒక్క ట్విస్టుతో కధ క్లైమాక్స్‌కి.. భలే ఉందే!

దాని ఫలితం కేజ్రీవాల్ తో పాటుగా ఆయన పార్టీ ‘ఆప్’ కూడా అనుభవించాల్సిన దుస్థితికి వచ్చింది. ఒక్క కేసు పదేళ్ల అధికారాన్ని దూరం చేసింది, కేజ్రీవాల్ కు మరో అవకాశం లేకుండా చేసింది. ఇపుడు జగన్ ది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. గతంలో కూడా జగన్ జైలుకు వెళ్ళాడు, కానీ తిరిగి రాగానే ఆయనను ఏపీ ప్రజలు విశ్వసించలేదు, ఆయన వైసీపీ పార్టీకి పట్టం కట్టలేదు.

అయితే ప్రజలలో తన మీద ఉన్న అపనమ్మకాన్ని తొలగించడానికి, తన తండ్రి వైస్సార్ మీద ఉన్న నమ్మకాన్ని తిరిగి రాబట్టుకోవడానికి జగన్ ‘పాదయాత్ర’ను ఒక అస్త్రంలా ఎంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 వేల కి.మీ సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల మనసు గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు జగన్ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి జైలు కెళ్తే రాని సానుభూతి, జగన్ మరోసారి పాదయాత్ర చేస్తే వస్తుందా అంటే.?

2017 లో అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీని కాదని పాదయాత్రతో ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టారు. అయితే అప్పటి వరకు జగన్ పాలనా విధానాలను, ప్రభుత్వం నడిపే పద్దతిని కానీ చూడని ఏపీ ప్రజలు తన తండ్రి వైస్సార్ తో పోలుస్తూ జగన్ కు ‘ముఖ్యమంత్రి’గా ఒక్క ఛాన్స్ అవకాశం ఇచ్చారు.

దాని ఫలితం ఎలావుంటుంది అని 2019 నుంచి 2024 వరకు చూసిన ఏపీ ప్రజలు జగన్ కు మరో ఎన్నికలలో కనీసం ‘ప్రతిపక్ష’ హోదా ఇవ్వలేకపోయారు. నాడు అధికారం కోసం పాదయాత్రలో జగన్ ప్రజలకు పెట్టిన ముద్దులు, ఇచ్చిన హగ్గులు అధికారం వచ్చాకా పరదాలుగా, ముళ్ళ కంచెలుగా మారిపోయాయి.

పాలనా అంటూ జగన్ చేసిన కక్ష్యపూరిత రాజకీయాలు, ప్రభుత్వం అంటూ రాష్ట్రంతో వైసీపీ ఆడిన మూడు ముక్కలాట, గత ఐదేళ్లు సంక్షేమం పేరుతో జగన్ చేసిన ఆర్థిక సంక్షోభం కళ్లారా చూసిన ప్రజలు ‘నువ్వే మా నమ్మకం’ జగనన్న అంటూ ముందుకొస్తారా.? రాష్ట్రాన్ని సమిధగా మార్చడానికి సిద్దమవుతారా.?

ఒకవేళ ఇప్పుడు కూడా జగన్ 2.0 అంటూ పాదయాత్ర మొదలు పెడితే జగన్ మాటలను నమ్మి వైసీపీ కి మరో అవకాశం ఇవ్వడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉండరు అనేది వైసీపిశ్రేణులు గ్రహించాలి. జగన్ ముఖ్యమంత్రి అయితే కేవలం బటన్లు నొక్కి సంక్షేమ కార్యక్రమాలు మత్రమే అమలు చేస్తారని, రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కానీ, పరిశ్రమల రాక కానీ, పెట్టుబడుల ఉద్దేశం కానీ వైసీపీ సిద్ధాంతం కాదనేది తేలిపోయింది.




కాబట్టి ఈసారి జగన్ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి జైలు యాత్రకు వెళ్లొచ్చినా…లేక జగన్ 2.0 అమలు కోసం పాదయాత్రకు తరలివచ్చినా జగన్ మాటను నమ్మి రాష్ట్ర భవిష్యత్ ను వైసీపీ కబంద హస్తాలలో పెట్టె సాహసానికి ఏపీ ప్రజలు ‘సిద్ధం’గా లేరనేది వైసీపీ శ్రేణులు గ్రహించాలి.