లక్ష్యం ఎవరికో గురి పెడితే… అది మరొకరికి తగలడమంటే ఇదేనేమో..! ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో ఇండియన్ బౌలర్ బూమ్రా వేసిన ‘నో బాల్’కు పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ఔటైన విషయం తెలిసిందే. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బ్యాట్స్ మెన్ ఏకంగా సెంచరీ బాది పాక్ ను గెలిపించాడు. టీమిండియా వైపు నుండి చూస్తే ఆ ఒక్క ‘నో’ బాల్ మ్యాచ్ ఫలితాన్నే శాశించినట్లయ్యింది. సరిగ్గా ఇదే ఉదంతాన్ని ఉపయోగించుకుని జైపూర్ పోలీసులు ప్రజలలో ట్రాఫిక్ పట్ల అవగాహనను తీసుకువచ్చే ప్రయత్నం చేసారు.
ఓ పక్కన బూమ్రా నో బాల్ ఫోటోను, మరో పక్కన కారు జీబ్రా లైన్స్ ను వేసి, గీత దాటితే ఎంతటి ప్రభావం ఉంటుందో మీకు తెలిసిందే… అంటూ పెద్ద పెద్ద హోర్డింగ్ లు పెట్టింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రగడే జరిగింది. బౌలర్ బూమ్రా స్పందిస్తూ… డోంట్ వర్రీ… ట్రాఫిక్ పోలీసులు చేసే తప్పులకు నేను స్పందించను… అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇది కాస్త వైరల్ కావడంతో బూమ్రాకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సహకారం లభించింది.
బూమ్రా కావాలని చేయలేదని, అలాగే పాక్ బ్యాట్స్ మెన్ సెంచరీ కొడతాడని ముందుగా ఎవరికీ తెలియదంటూ… జైపూర్ పోలీసులు చేసిన హోర్డింగ్స్ పై మండిపడుతున్నారు. దీంతో మళ్ళీ పోలీసులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘తాము బూమ్రాను ఇబ్బంది పెట్టడానికో, అతని ప్రతిష్టను దెబ్బ తీయడానికో ఇలా చేయలేదని, కేవలం ప్రజలలో అవగాహన కలిగించడానికే ఇలా చేసామని, నిజానికి బూమ్రా యూత్ ఐకాన్ అంటూ సంభోదిస్తూ పోస్ట్ లు చేసారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కూడా!



