స్టేజ్ లపై హీరోలను ప్రశంసించడంలో పరుచూరి బ్రదర్స్ శైలే వేరన్నది ఇండస్ట్రీ టాక్. ఏ హీరో వేడుక మీద ఉంటే, ఆ హీరోను ఆకాశానికేత్తేసే పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన గోపాలకృష్ణ, తాజాగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తన టాలెంట్ ను ప్రదర్శించారు. నాగబాల సురేశ్ కుమార్ రచించిన ‘తెలంగాణ కోటలు’ అనే పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన గోపాలకృష్ణ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చాంబర్ లో ఆయనతో కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడిన పరుచూరి గోపాలకృష్ణ… “తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న సిఎం మాత్రమే కాదు, మనసున్న నాయకుడని ప్రశంసించారు. ఏ గడ్డపై అయితే తాను పుట్టారో ఆ గడ్డకు న్యాయం చేసేందుకు కేసీఆర్ పోరాడుతున్నారని కితాబునిచ్చారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ నిరుపేదల కోసం ఒక గదిని నిర్మిస్తే… నేడు డబుల్ బెడ్ రూమ్ గదులను కేసీఆర్ అందిస్తున్నారని ప్రశంసించారు. చరిత్రను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కుతుబ్ షాహీ టూంబ్స్ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి కారణం నాడు ఎన్టీఆర్ చేసిన కృషేనని, ఈ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ కు అంకితమివ్వడం చాలా గొప్ప విషయమని కేవీ రమణాచారి అన్నారు.



