అమరావతిలో బిజెపి నేతల మొసలి కన్నీళ్ళు

అమరావతిలో బిజెపి నేతల మొసలి కన్నీళ్ళుగుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ అధ్వర్యంలో బుదవారం రాజధాని గ్రామలైన నెక్కల్లు, పెదమరిమి, శాఖమూరులో మనం-మన అమరావతి పేరుతో పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా బిజెపి నేతలు భానుప్రకాష్ రెడ్డి, నిర్మలా కిషోర్ తదితరులు గ్రామస్తులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాజధాని కోసం భూములు ఇచ్చిన మిమ్మల్ని వేధిస్తూ సిఎం జగన్మోహన్ రెడ్డి రాక్షసానందం అనుభవిస్తున్నారు. రైతులు 900 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు. రైతులు తమ కోసం ఉద్యమం చేయడం లేదు. యావత్ రాష్ట్ర ప్రజల కోసం రాజధాని నిర్మించాలని ఉద్యమం చేస్తున్నారు. కనుక వారికి సంఘీభావం తెలిపి, వారి పోరాటంలో మేము కూడా పాలు పంచుకొంటాము. మా ఆధిష్టానం కూడా అమరావతి ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని మమ్మల్ని ఆదేశించింది. కనుక అమరావతి నిర్మాణ పనులు పూర్తయ్యేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉంటాము,” అని చెప్పారు.

ADVERTISEMENT

రాజధాని రైతులు 900 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారని, అయినా జగన్ వారిని పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్న బిజెపి నేతలు కూడా ఇంతకాలం రైతులను పట్టించుకోలేదు. ఎందుకంటే వారి అధిష్టానం ఇంతకాలం వైసీపీతో అంటకాగుతూ రాజధాని విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అని చెపుతుంటే రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం దానిలో మేము జోక్యం చేసుకోదలచుకోలేదని చెప్పి తప్పించుకొంది.

ఓ ఆరేడు నెలల క్రితం హటాత్తుగా తన వైఖరిని మార్చుకొని అమరావతినే రాజధానిగా ఉంచాలని చెప్పిన తరువాతే రాష్ట్ర బిజెపి నేతలు అమరావతి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వం నిధులు, అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం మీదే ఆధారపడి ఉన్నందున అమరావతిలో నిర్మాణాలు వేగవంతం చేయాలని గట్టిగా చెప్పవచ్చు. కానీ నేటికీ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ పాటపడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఏమనడం లేదు. కనుక రాష్ట్ర బిజెపి నేతలు ఏదో రాజకీయ ప్రయోజనం ఆశించే రాజధాని గ్రామాలలో హడావుడి చేస్తున్నారు తప్ప నేటికీ వారికి రాజధాని విషయంలో పెద్దగా పట్టింపు, చిత్తశుద్ధి రెండూ లేవనే అర్దమవుతూనే ఉంది.

బహుశః వచ్చే ఎన్నికలలో రాజధాని ప్రాంతాలలో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను దండుకోవాలనే ఆలోచనతోనో లేదా తమకు వైసీపీకి మద్య రహస్య అవగాహన లేదని ప్రజలను నమ్మించడానికో మొసలి కన్నీళ్ళు కార్చుతూ రాజధాని గ్రామాలలో పాదయాత్రలు చేస్తున్నట్లు సందేహించకతప్పదు.

కనుక అమరావతి విషయంలో బిజెపి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవలసి ఉంది. జగన్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఆయన చేతే మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకొన్నామని చెప్పించి, రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసినప్పుడే బిజెపిని రాష్ట్ర ప్రజలు నమ్ముతారు లేకుంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి పడుతుంది.

ADVERTISEMENT
Latest Stories