దీపావళి పర్వదినం సందర్భంగా మంచి టైమింగ్ పోస్టర్ తో ఆడియన్స్ మనసు దోచుకున్నాడు పవర్ స్టార్. మాస్ టైటిల్ పెట్టుకుని కూల్ లుక్ తో ఎంట్రీ ఇవ్వడంతో అందరూ అవాక్కయ్యారు. నిజానికి ఒక పవర్ ఫుల్ ఫోటోతో ‘కాటమరాయుడు’ దర్శనం ఉంటుందని అభిమానులు భావించినప్పటికీ, ప్రశాంతంగా దీపాలు వెలిగిస్తూ ఇచ్చిన ఫోటో ఆకర్షించడమే కాదు, అసలైన పండుగను చాటిచెప్పేలా ఉంది.
అయితే రొటీన్ గా ఇచ్చే ఇలాంటి సినిమా పోస్టర్ల నడుమ, తాజాగా పవర్ స్టార్ కు సంబంధించిన మరికొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. కళ్ళజోడు పెట్టుకుని విమానంలో ఓ అభిమానితో దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ కళ్ళజోడులో పవన్ కాస్త కొత్తగా కనపడడంతో సదరు ఫోటోకు అభిమానులు నీరాజనం పలుకుతున్నారు.
ఇప్పటివరకు ఇలాంటి కళ్ళజోడు పెట్టుకుని కనీసం ఏ ఒక్క సినిమాలో గానీ, సీన్ లో గానీ చేయకపోవడంతో… పవర్ స్టార్ ఫోటోకు కొత్త రూపు సంతరించుకుంది. దీంతో ‘కాటమరాయుడు’ ఫస్ట్ లుక్ తో పాటు, అభిమానితో దిగిన ఈ ఫోటోలు కూడా అదే స్థాయిలో హంగామా చేస్తూ… ‘పవర్ స్టారా… మజాకా..!’ అనిపిస్తున్నాయి.



