కుటుంబంతో యూరప్ పర్యటనకు వెళ్లొచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుండి తిరిగి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అయితే సాక్షిలో వచ్చిన ఒక కథనం ప్రకారం ఈ కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహంతో ఒక్కసారిగా వేదిక పైకి వచ్చారు. దీంతో బౌన్సర్లు, జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.
[m9ad]
ఆ సమయంలో బౌన్సర్లు జనసేన కార్యకర్తలను నెట్టివేశారు. దీంతో పలువురు జనసేన కార్యకర్తలు, ఫొటోగ్రాఫర్లు కిందపడిపోయారు. కొందరైతే ఏకంగా పిడిగుద్దులు గుద్దారట. ఎంతసేపటికీ అక్కడి పరిస్థితి అదుపులో లేకపోవడంతో పవన్ కల్యాణ్ ఆ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొత్త సంవత్సరం మొదటి రోజే ఇలా జరగడంతో జనసేన శ్రేణులు నిరాశకు గురయ్యాయి. మరోవైపు 2019 ఎన్నికల ప్రచారం విజయవాడ నుండే ప్రారంభిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకు అమరావతికి మకాం మార్చనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయి పర్యటనలకు, నాయకులకు ఆయన అందుబాటులో ఉండటానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఆ పార్టీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. సంక్రాంతి కల్లా పవన్ కళ్యాణ్ అమరావతికి షిఫ్ట్ అయిపోతారని సమాచారం. దీనికోసం మంచి రోజు కోసం వేదపండితులను సంప్రదిస్తున్నారట.



