జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలిసి, జనసేన నాయకుడు కొట్టే సాయిపై చెయ్యి చేసుకొన్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేశారు. ఆమెపై తక్షణం చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “మన ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. శ్రీకాళహస్తిలో మా పార్టీ నేతలు, కార్యకర్తలు చాలా శాంతియుతంగానే నిరసన దీక్ష చేస్తుంటే, సీఐ అంజూ యాదవ్ మా వాళ్లపై చెయ్యి చేసుకొన్నారు. అందుకే నేను స్వయంగా వచ్చి ఎస్పీగారికి ఆమెపై ఫిర్యాదు చేయవలసి వచ్చింది.
ఇప్పటం గ్రామంలో కావచ్చు లేదా శ్రీకాళహస్తిలో కావచ్చు పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి ఉంటుంది. అది మేము అర్దం చేసుకోగలము. అయితే మా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. మచిలీపట్నంలో మేము భారీ బహిరంగసభ నిర్వహించుకొన్నాము. కానీ మా జనసైనికులు అందరూ ఎంతో క్రమశిక్షణతో మెలుగుతూ ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా వ్యవహరిస్తూ సభను విజయవంతం చేశారు. మేము క్రమశిక్షణతో మెలుగుతాము. పోలీసులను కూడా అలాగే క్రమశిక్షణతో మెలుగుతూ శాంతిభద్రతలు కాపాడాలని కోరుకొంటున్నాను. మా పార్టీ నాయకుడుపై సీఐ దాడిని జాతీయ మానవ హక్కుల కమీషన్ సుమోటుగా స్వీకరించినందుకు వారిని నేను కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.
టిడిపి కార్యాలయాలు, కార్యకర్తలపై కూడా తరచూ వైసీపీ దాడులు చేస్తూనే ఉంటుంది. గన్నవరంలో వల్లభనేని వంశీ అనుచరులు రెచ్చిపోయి టిడిపి కార్యాలయాన్ని తగులబెడితే, అడ్డుకోవడానికి వెళ్ళిన టిడిపి సీనియర్ నేత పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసి అర్దరాత్రిపూట అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది.
తాజాగా ఆదివారం సాయంత్రం పల్నాడు జిల్లా, కోటప్పకొండ వద్ద టిడిపి జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు.
ఇంత తీవ్రమైన దాడి జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లేదా అచ్చెన్నాయుడు చాలా సంయమనం పాటిస్తూ ఖండిస్తూ మాట్లాడుతారు తప్ప ఈవిదంగా నేరుగా ఎస్పీ, డీఎస్పీలను కలిసి ఫిర్యాదు చేయరు. వారి సహనాన్ని వైసీపీ నేతలు అలుసుగా తీసుకొని రెచ్చిపోతూనే ఉన్నారు.
కానీ పవన్ కళ్యాణ్ తన ఈ ఒక్క చర్యతో ప్రభుత్వానికి, పోలీసులకు గట్టి సందేశమే ఇచ్చారని భావించవచ్చు. తద్వారా ఈ అంశంపై అవసరమైతే కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసి చర్యలు తీసుకొనేలా చేసుకొన్నారని చెపొచ్చు. కనుక టిడిపి కూడా ఇదేవిదంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వైసీపీని కూడా నిలువరించగలరు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు అండగా నిలబడినట్లు ఉంటుంది. దాంతో పార్టీ మనకు కొండంత అండగా ఉందనే మనోధైర్యం కూడా వారిలో కలుగుతుంది



