వినమ్రతతో పవన్, అహంతో జగన్‌ రాజకీయ ప్రయాణం

Pawan Kalyan's Grace vs Jagan’s Arrogance?

పవన్‌ కళ్యాణ్‌, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఎన్నో డక్కాముక్కీలు తిని ఈ స్థాయికి ఎదిగినవారే. ఇద్దరికీ ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువే. ఇద్దరూ భవిష్యత్తు పట్ల గట్టి నమ్మకం కనబరుస్తుంటారు. కానీ పవన్‌ కళ్యాణ్‌కి ఉన్న పాజిటివ్ థింకింగ్, వినమ్రత జగన్‌లో కనపడవు.

తండ్రి మరణం, సానుభూతి, రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకు పోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్ వైసీపీకి బదిలీ అవడం, తల్లి, చెల్లి అండగా నిలబడటం వంటివి అనేకం జగన్‌కు చాలా కలిసివచ్చాయి. అందువల్లే అక్రమాస్తుల కేసులలో 16 నెలలు చంచల్ గూడా జైల్లో గడిపివచ్చినప్పటికీ ముఖ్యమంత్రి కాగలిగారు.

ADVERTISEMENT

మెగాస్టార్ చిరంజీవి కారణంగా పవన్‌ కళ్యాణ్‌కి సినీ పరిశ్రమలో బలమైన పునాది పడినప్పటికీ, చిరంజీవి ప్రజారాజ్యం ప్రయోగం విఫలమైన తర్వాత జనసేనతో రాజకీయాలలోకి ప్రవేశించినందున పవన్‌ కళ్యాణ్‌ ఏటికి ఎదురీదవలసి వచ్చింది.

కల్వకుంట్ల కవిత వంటి పొరుగు రాష్ట్రం నేతలు కూడా జనసేన ‘ఓపెన్ అండ్ షట్ పార్టీ’ అవుతుందని జోస్యం చెప్పారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ చాలా నిబ్బరంగా ముందుకు సాగారు. ఆ సమయంలో అయన వెంట నిలిచింది అభిమానులే. వారు కూడా లేకపోతే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలో కొనసాగేవారో లేదో?

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలు మొదట్లో చాలా అస్తవ్యస్తంగా, అగమ్యగోచరంగా సాగుతున్నట్లు అనిపించినా ఎదురుదెబ్బల నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకుంటూ, అవమానాలు, అవహేళనలను భరిస్తూ రాజకీయాలలో గట్టిగా నిలబడతానని పదేపదే చెప్పారు. నిలబడ్డారు కూడా. అందువల్లే పవన్‌ కళ్యాణ్‌ నేడు ఈ స్థాయికి చేరుకున్నారు.

రాజకీయాలలో తనను నమ్ముకున్నవారిని కూడా గెలిపించుకొని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళారు. కనుక రాజకీయాలలో ఏటికి ఎదురీది గెలిచారని చెప్పక తప్పదు.

పవన్‌ కళ్యాణ్‌ పాజిటివ్ దృక్పథంతో రాజకీయాలు చేస్తూ అందరి మనసులు గెలుచుకుంటే, జగన్‌ ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు చేసి పార్టీని బలపరుచుకున్నారు. ఇద్దరూ వేర్వేరు దారులలో పయనించినా ప్రజల మనసులు గెలుచుకొని అధికారంలోకి రాగలిగారు.

అయితే పదవీ, అధికారం చేతిలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి వరుసగా అన్నీ తప్పులే చేసుకుంటూ పోయి పదవీ అధికారం పోగొట్టుకున్నారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సిఎం, మంత్రి పదవులు చేపట్టినప్పటికీ ఆయన మాట తీరు, ఆలోచనా విధానం, వైఖరిలో ఎటువంటి మార్పులు రాలేదు. ఎప్పటిలాగే నిరాడంబరంగా, హుందాగా, వినమ్రంగా వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో ఘర్షణ పడి కూటమి ప్రభుత్వాన్ని పడగొడతారని జగన్‌ పగటి కలలు కన్నారు. కానీ ఏడాది పాలన గడిచేసరికి చంద్రబాబు నాయుడు-పవన్‌ కళ్యాణ్‌-నారా లోకేష్‌ మద్య అనుబంధం మరింత పెరిగింది.

ఆస్తుల కోసం జగన్‌, షర్మిల, విజయమ్మ కోర్టులకు వెళ్ళి కొట్లాడుకుంటున్నారు. తెలంగాణలో పదవుల కోసం కల్వకుంట్ల కవిత- కేసీఆర్‌, కేటీఆర్‌ మద్య విభేదాలు ఏర్పడ్డాయి.

కానీ కూటమి ప్రభుత్వంలో ఏ రక్త సంబంధమూ లేని పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ఇద్దరూ అన్నదమ్ములా కలిసిపోయారు. పరస్పరం గౌరవించుకుంటూ రాజకీయనాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వంలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యత లభిస్తోంది. దానిని వారిద్దరూ కూడా సద్వినియోగం చేసుకొంటూ ముందుకు సాగిపోతున్నారు.

జగన్‌ విషయానికి వస్తే, పదవీ అధికారం కోల్పోయినా అహంభావం, అరాచకం మానుకోలేదు. కనుక రాజకీయాలలో ఎలా ఉండాలో పవన్‌ కళ్యాణ్‌ని చూసి, ఎలా ఉండకూడదో జగన్‌ని చూసి నేర్చుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories