స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమిలో మూడు పార్టీలు సన్నాహాలు మొదలుపెట్టాయి. ముఖ్యంగా టీడీపి, జనసేన పార్టీలలో ఈ హడావుడి బాగా కనిపిస్తోంది. జనసేన నేతల సీట్ల డిమాండ్ల నేపధ్యంలో డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఆలోచింపజేసేవే.
“కూటమి బలంగా ఉండాలి. కానీ జనసేనకు తగిన గౌరవం కోరుకుంటాను. కూటమి ఐఖ్యతను దెబ్బ తీసేలా పార్టీలో ఎవరూ మాట్లాడవద్దు. రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం. అందుకే ఇదివరకు కొన్ని త్యాగాలు చేయడానికి వెనుకాడలేదు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ బలోపేతం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. కనుక ఈసారి బలం ఉన్న చోట జనసేన తప్పక పోటీ చేస్తుంది,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆయనవేమీ గొంతెమ్మ కోర్కెలు కావు. ఓ రాజకీయ పార్టీ అధినేతగా తన పార్టీకి సముచిత గౌరవం, ప్రాధాన్యం కోరుకోవడం తప్పు కాదు. ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా ఉన్నందున కూటమి బలంగా ఉండాలని కోరుకోవడం సహజం.
దానిని మనమే దెబ్బ తీసుకోకూడదని సున్నితంగా పార్టీ శ్రేణులకు చెప్పారు. జనసేనకు బలం ఉన్న చోట పోటీ చేయాలని కోరుకోవడం సబబే.
కానీ కూటమిలో ఏకపక్ష నిర్ణయాలు అసాధ్యం. కనుక ఎవరి జాబితాలు వారు పట్టుకొని మూడు పార్టీల నేతలు చర్చించి సీట్ల సర్దుబాట్లు చేసుకోక తప్పదు.
పవన్ కళ్యాణ్ చెప్పినట్లు శాసనసభ ఎన్నికలు రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయి. కనుక అప్పుడు పట్టువిడుపులు అవసరమే. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జనసేన బలం పరీక్షించుకొని తెలుసుకోవడానికి, బలం పెంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి.
అంతేకాదు.. ఈ ఎన్నికలు కూటమి ఐఖ్యతకు, బలాన్ని నిరూపించుకోవడానికి కూడా చాలా అవసరం. కనుక మూడు పార్టీలు విచక్షణతో ముందుకు సాగుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, కూటమి ఐఖ్యతని, ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నవారికి తగిన గుణపాఠం నేర్పించేందుకు తమ సత్తా నిరూపించి చూపాల్సి ఉంటుంది. ఈ మినీ పరీక్షలో కూటమి పార్టీలు సఖ్యతగా విజయం సాధిస్తే, ప్రజలకు కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఇంకా పెరుగుతుంది. అప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మరో ఆలోచన లేకుండా మళ్ళీ కూటమి ప్రభుత్వానికే అధికారం కట్టబెడతారని మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు గ్రహించడం చాలా అవసరం.




