తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన 8 స్థానాలలో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయి నవ్వులపాలైంది. బీజేపీ పెద్దల ఆలోచనలని పవన్ కళ్యాణ్ సరిగ్గా అర్దంచేసుకోలేకపోవడం వలననే వారు ఆడిన రాజకీయ చదరంగంలో పావుగా మారారని చెప్పక తప్పదు.
కనుక బీజేపీ పెద్దలు ఏపీలో కూడా ఇలాగే డబుల్ గేమ్ ఆడుతున్నారని పవన్ కళ్యాణ్ గ్రహిస్తే మంచిది. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మౌనంగా ఉండిపోవడం ద్వారా వారు జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన్నట్లే సూచించారు.
మరో విషయం ఏమిటంటే అప్పుడు పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు పెట్టుకొన్నట్లు ప్రకటించినప్పటికీ, బీజేపీ పెద్దలు స్పందించలేదు. ఏమీ జరగనట్లు తెలంగాణలో ఆయన సహకారం తీసుకొన్నారు కూడా.
జనసేనతో పొత్తు వలన బీజేపీ లాభపడింది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయమని పదేపదే చెపుతున్న పవన్ కళ్యాణ్, తెలంగాణలో బీజేపీతో కలిసి సరిగ్గా అదే చేసి బిఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత తోడ్పడ్డారు కూడా. కనుక ఏపీలో కూడా ఆయన చేత బీజేపీ అధిష్టానం ఇదే చేయించవచ్చు.
ఎందుకంటే, తెలంగాణతో పోలిస్తే ఏపీ బీజేపీ చాలా బలహీనంగా ఉంది. కనుక మళ్ళీ మోడీ, అమిత్ షాలే స్వయంగా వచ్చి ప్రచారం చేసినా ఏపీ బీజేపీ ఎన్నికలలో గెలవలేదు. కనుక వారికి ఏపీ బీజేపీ, ఆంధ్రప్రదేశ్, దాని అభివృద్ధిపై ఏమాత్రం ఆసక్తి ఉండదనే చెప్పాలి.
కనుక అవసరమైతే జనసేన, టిడిపిల కూటమిలో చేరి జగన్మోహన్ రెడ్డిని గెలిపించే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే, టిడిపి, జనసేనల కంటే, అప్పులు, కేసుల కారణంగా తమకు ఎల్లపుడూ వీరవిదేయంగా ఉండే జగన్మోహన్ రెడ్డి మేలని మోడీ, అమిత్ షాలు భావించడం సహజమే కదా?
కనుక జనసేన బీజేపీని వదులుకోవడం చాలా మంచిది. అప్పుడే తెలంగాణలో కాంగ్రెస్‌ని గెలిపించడానికి కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైన్నట్లు, ఏపీలో జగన్‌ను ఓడించేందుకు ఆయన వ్యతిరేక శక్తులన్నీ ఒక్కతాటిపైకి వస్తాయి. అప్పుడే టిడిపి, జనసేనలు ఎన్నికలలో గెలిచే అవకాశం ఉంటుంది.
అప్పుడు బీజేపీ నేరుగా వైసీపికి సహకరిస్తుంది కదా? అని అనుమానం కలుగవచ్చు. కానీ జగన్‌ను గెలిపించేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తే ఆ రెండు పార్టీల పట్ల ఏపీ ప్రజలలో మరింత వ్యతిరేకత పెరుగుతుంది. అప్పుడు రెండూ నష్టపోతాయి.
కనుక పవన్ కళ్యాణ్ బీజేపీని పూర్తిగా వదులుకొని టిడిపితో కలవడమే జనసేనకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా మంచిది.




