జయాపజయాలతో సంబంధం లేకుండా మార్కెట్ లో ఎప్పుడూ సంచలనం సృష్టించడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుంటారు. ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా, మరుసటి సినిమా మళ్ళీ మార్కెట్ లో క్రేజీగా మారడం షరామామూలే. ఇది అందరి హీరోల విషయంలో జరిగే సాధారణ విషయం కాదు, కేవలం రజనీకాంత్, పవన్, మహేష్ వంటి అతి కొద్ది మంది హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే అంశం. అలాంటిది, ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న “కాటమరాయుడు” సినిమాకు టాలీవుడ్ మార్కెట్ లో క్రేజ్ లేదన్న ప్రచారం జరుగుతోంది.
ఇదేదో ఒక విమర్శగా కాకుండా… పక్కా సమాచారంతో చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా దర్శకుడు డాలీకి మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ లేకపోవడం మరియు ఎంపిక చేసుకున్న కధ ఓ తమిళ రీమేక్ కావడం ప్రధాన కారణంగా చెప్తున్నారు. అయితే, పవన్ కు రీమేక్ లేమి కొత్త కాదు. పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలబడిన ‘ఖుషీ, గబ్బర్ సింగ్’ వంటి సినిమాలు రీమేక్ లే. అయితే తాజా రీమేక్ విషయానికి వచ్చే పాటికి దర్శకుడు డాలీ కావడంతో, ప్రేక్షకులలోనూ, మార్కెట్ లోనూ ఆసక్తి కోల్పోయిందన్నది ట్రేడ్ టాక్.
దీనికి మరో బలమైన కారణం… ప్రీ రిలీజ్ బిజినెస్. ఇప్పటివరకు ‘కాటమరాయుడు’కు సంబంధించి పెద్దగా బిజినెస్ జరగకపోవడం పవన్ సినిమాకు డిమాండ్ లేకపోవడాన్ని సూచిస్తుందని సినీ జనాలు చెప్పుకుంటున్న విషయం. వచ్చే ఏడాది ‘కాటమరాయుడు’తో పాటు సమ్మర్ లో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలకు ఓ పక్కన జోరుగా బిజినెస్ జరుగుతుంటే… పవన్ ఉండి కూడా ఆ క్రేజ్ ను తెచ్చుకోవడం లేదన్నది ఓ టాక్. వచ్చే ఏడాది సమ్మర్ కు సిద్ధమైన కొన్ని సినిమాల శాటిలైట్ హక్కులు మరియు ఓవర్సీస్ హక్కులు ఇప్పటికే పూర్తి కాగా, పవన్ సినిమా ఖాతా ఓపెన్ చేయకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది.
నిజానికి ‘ప్రీ రిలీజ్ బిజినెస్’ పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాకపోయినప్పటికీ, మార్కెట్ లో ఆయా హీరోలకు ఉండే క్రేజ్ ను మాత్రం ఈ ‘ప్రీ రిలీజ్ బిజినెస్’ మాత్రమే డిసైడ్ చేస్తుంది. బహుశా పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి సిద్ధమవుతున్న తరుణంలో… పవర్ స్టార్ సినిమాలపై ఉన్న ఫోకస్ అటు పొలిటిక్స్ పైకి మళ్ళిందేమోనని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే సినిమా విడుదల సమయం దగ్గరికి వస్తే ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయని, ఒక్క టీజర్ తోనే సెన్సేషన్ సృష్టించగల సత్తా పవన్ సొంతమని అభిమానులు చెప్తున్న మాట.



