కిరణ్ కుమార్‌ రెడ్డితో కలిసి ప్రచారం ఓకేనా?

pawan-kalyan-kiran-kumar-reddy-chandrababu-naidu

సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌ రెడ్డి చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు బీజేపీలో చేరి మళ్ళీ అన్నమయ్య జిల్లా, రాజంపేట ఎంపీ అభ్యర్ధిగా ప్రజల ముందుకు వచ్చారు. తొలిసారిగా ఆయన చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లతో కలిసి రాజంపేట సభలో పాల్గొన్నారు. టిడిపి, జనసేన, బీజేపీల మద్య పొత్తు ఉంది కనుక ముగ్గురూ కలిసి ఎన్నికల సభ నిర్వహించడం సహజమే.

ADVERTISEMENT

అయితే కిరణ్ కుమార్‌ రెడ్డితో టిడిపి, జనసేనలకు మేలు కలుగుతుందా లేక ప్రజల వ్యతిరేకతని ఎదుర్కోవలసివస్తుందా? అనే సందేహం కలుగక మానదు. అంతేకాదు… ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది.

ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ వైపు రాష్ట్ర విభజన ప్రక్రియలో ఎక్కడా ఆటంకం కలుగకుండా చకచకా పనులు చేయిస్తూనే మరోపక్క రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్లు చాలా డ్రామాలు ఆడారు. విభజన ప్రక్రియ సజావుగా పూర్తి చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఇన్నేళ్ళు రాజకీయ సన్యాసం కూడా ఆ డ్రామాలో భాగమే అని చెప్పక తప్పదు. ఆయన డ్రామాలు ఆడారని ప్రజలు గట్టిగా నమ్మబట్టే 2014 ఎన్నికలలో ఆయన సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టుకొని వచ్చిన ప్రజలు తిరస్కరించారు. ఆయన కూడా ఈ విషయం ముందే గ్రహించారు కనుకనే ఆయన ఆ ఎన్నికలలో పోటీ చేయలేదు. మరిప్పుడు పోటీ చేస్తే ప్రజలు అవన్నీ మరిచిపోయి గెలిపిస్తారా? ఒకవేళ ప్రజలలో ఆయనపై ఇంకా వ్యతిరేకత నెలకొని ఉండి ఉంటే, ఆ ప్రభావం టిడిపి, జనసేనల మీద కూడా పడుతుంది కదా?

నిన్న ఎన్నికల సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన కుమారుడు మిధున్ కుమార్‌ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేశారని కిరణ్ కుమార్‌ రెడ్డి ఆరోపిస్తున్నప్పుడు తిరిగి వారు కూడా ఆయనను అదే ప్రశ్నించవచ్చు. ఆయన హయాంలో జరిగిన ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి వైసీపి ప్రశ్నిస్తే కిరణ్ కుమార్‌ రెడ్డి ఏమని సమాధానం చెప్పుకుంటారు?

చివరి నిమిషం వరకు కాంగ్రెస్‌ పార్టీకి వీరవిధేయుడుగా వ్యవహరించి రాష్ట్ర విభజనకు సహకరించిన ఆయన ఇన్నేళ్ళు రాజకీయాలకు ఎందుకు దూరం ఉన్నారు? బీజేపీలో ఎందుకు చేరారు? అనే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కిరణ్ కుమార్‌ రెడ్డిపై ఉంది. కానీ ఆయన చెప్పరు కనుక అది వైసీపికి అడ్వాంటేజ్‌గా మారుతుంది కదా?

కనుక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి ఎన్నికల ప్రచారం చేయడం వేరు. బీజేపీ అభ్యర్ధి కిరణ్ కుమార్‌ రెడ్డితో కలిసి ప్రచారం చేయడం వేరనే చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories