బాబు..పవన్ ల భేటీ: నెక్స్ట్ ఏంటి?

Chandrababu-Naidu-pawan-Kalyan

ఇటలీ లో జరిగిన వరుణ్ – లావణ్యాల పెళ్లి వేడుకకు హాజరయిన పవన్ నిన్న ఉదయం హైద్రాబాద్ చేరుకున్నారు. ఉండవల్లి నుండి హైద్రాబాద్ చేరుకున్న చంద్రబాబు కూడా తనకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ హైద్రాబాద్ తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో పవన్, నాదెండ్లతో కలిసి చంద్రబాబును పరామర్శించారు.

బాబుని అరెస్టు చేసినప్పుడు రాజమండ్రిలో బాబుతో ములాఖత్ అయిన పవన్..,జనసేన, టీడీపీ ఏపీలో వైసీపీ చేస్తున్న దాష్టికాలపై కలిసి పోరాడతాం అంటూ పొత్తు ప్రకటన చేసిన తరువాత బాబును నేరుగా కలవడం పవన్ ఇదే తొలిసారి కావడంతో వీరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది.అయితే పవన్ ముందుగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.బాబు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు పై పెడుతున్న వరుస కేసుల గురించి, వాటిపై తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలపై కూడా చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. పొత్తులో భాగంగా రెండు పార్టీలు ప్రజాక్షేత్రంలో చేయవలసిన పోరాటాల మీద, రెండు పార్టీల ఉమ్మడి మానిఫెస్టో రూపకల్పన పై చర్చించనున్నారని సమాచారం.

టీడీపీ పార్టీ తెలంగాణ ఎన్నికల బరి నుండి పోటీని విరమించుకున్న తరుణంలో తెలంగాణ లో జనసేన వేస్తున్న రాజకీయ అడుగులకు టీడీపీ సానుభూతి పరులు జనసేన వైపు చూసే అవకాశం ఉంది. అయితే తెలంగాణ ఎన్నికలలో బీజేపీతో పొత్తు లో ముందుకెళ్తున్న జనసేన ఆంధ్రప్రదేశ్ లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించనున్నారు.

బాబు అరెస్టుతో ప్రజలలో వచ్చిన సింపతీని ప్రభుత్వ వ్యతిరేక ఓటు గా మార్చుకోగలిగితే రెండు పార్టీల ఉమ్మడి లక్ష్యం దాదాపు నెరవేరినట్టే. అయితే పొత్తు ప్రకటన చేయడం కాదు దానిని చివరి వరకు కొనసాగించగలిగితేనే రెండు పార్టీల ఉమ్మడి శత్రువుని అంతమొందించగలరు.ఇప్పటి వరకు ఇరుపార్టీల మధ్య జరిగింది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇకనుండే అసలైన రాజకీయ అడుగులు మొదలయ్యేది.

సీట్ల సర్దుబాట్లు, ఓట్ల బదిలీలు,స్థానిక నేతల బుజ్జగింపులు,కొత్త నేతల ఆహ్వానాలు, కోవర్ట్ రాజకీయ నేతల విమర్శలు,ప్రత్యర్థుల వ్యూహాలు…ఇలా రానున్న కాలంలో రెండు పార్టీల అధినేతలకు పొత్తు ధర్మం నిలుపుకోవడం కత్తిమీద సాము వంటిదే. క్షేత్ర స్థాయి నాయకులను ఏకంచేయడం ఉమ్మడి కార్యచరణాల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను ఒక్క తాటిపైకి తేవడం ఇవన్నీ చేయడానికి అనుభవంతో పాటు ఓర్పు నేర్పు కూడా ఉండాలి.

బాబు అరెస్టు తో ఆగిపోయిన టీడీపీ కార్యక్రమాలను తిరిగి పునరుద్ధరించి, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీలను ప్రజలకు వివరించి, ప్రతిపక్ష నేతలపై మోపుతున్న కేసులను సమర్థవంతంగా ఎదుర్కొంటు అధికార పార్టీ విధానాలపై ఎలా ముందుకెళ్లాలి? నెక్స్ట్ ఏంటి? అనేదే ఈ భేటీకి మూలాధారం.

ADVERTISEMENT
Latest Stories