నెగ్గాలి అంటే ఎక్కడ తగ్గాలో కూడా పవన్ కు తెలుసు..!

Pawan Kalyan Meets Pulaparthi Ramanjaneyulu In Bhimavaram

గత ఎన్నికలో పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండు స్థానాలలో ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి తప్పకుండ అసెంబ్లీ లోకి అడుగుపెట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ పడ్డారో అక్కడే తిరిగి విజయం సాధించి తన స్థాయిని, స్థానాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు పవన్.

ADVERTISEMENT

భీమవరం పర్యటనలో ఉన్న పవన్ టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యురాలు సీతామహాలక్ష్మి తో భేటీ అయ్యి స్థానిక పరిస్థితుల పై గంట పాటు చర్చలు జరిపారు. అలాగే నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇంచార్జిలతో భేటీ అయ్యి త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దీనితో ఈసారి పవన్ పోటీ భీమవరం నుంచే అనేది ఇరు పార్టీల నేతలకు ఒక క్లారిటీ వచ్చినట్లయ్యింది.

భీమవరం నుండి పోటీ చేసి గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో దాదాపు 8 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు పవన్. టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు 54037 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. జనసేన పవన్ కు పోలైన ఓట్లు 62285 . మొత్తం రెండు పార్టీలకు పోలైన ఓట్లు చూస్తే 116322 .అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యే గ్రంథికి వచ్చిన ఓట్లు 70642 .

అంటే టీడీపీ – జనసేన కలిసి పోటీచేసినట్లయితే గత ఎన్నికలలోనే సుమారు 45 వేల ఓట్ల తేడాతో ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థి వైసీపీ అభ్యర్థి పై విజయం సాధించేవారు. ఇప్పుడు దీనికి తోడు వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత, స్థానికంగా జనసేన తన బలాన్ని పెంచుకోవడం ఇరు పార్టీలకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవాలి.

ఇటువంటి తరుణంలో భేషజాలకు పోయి నేను ఒక పార్టీ అధినేతను, మిత్ర పార్టీ కార్యకర్తలతో, ఆ పార్టీ నేతలతో నాకేం పని అన్నట్టుగా వ్యవహించి అధికార వైసీపీ కి అవకాశం ఇవ్వకుండా పవన్ తానూ నెగ్గాలంటే కాస్త తగ్గినా పర్లేదు అనుకుని స్థానిక టీడీపీ శ్రేణులతో భేటీ అయ్యి తనకు, తన పార్టీకి అండగా నిలవాలని కోరనున్నారు.

పొత్తులో భాగంగా ఇరు పార్టీల మధ్య సక్రమంగా ఓట్ల బదిలీ జరిగితే వైసీపీ అభ్యర్థిని ఓడించడం, పవన్ అసెంబ్లీ కల నెరవేరడం రెండు నల్లేరు మీద నడక మాదిరనే చెప్పాలి. ఇటువంటి తరుణంలో వైసీపీ పార్టీకి భీమవరం లో మరో ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో రెండు పార్టీల క్యాడర్ ను కలుపుకుపోవడానికి పవన్ సిద్ధమయ్యారు. ఇదేవిధంగా పోటీ చేస్తున్నఅన్ని స్థానాలలో కూడా ఇరు పార్టీల నేతలు ఉమ్మడి లక్ష్యం కోసం ముందుకు రాగలిగితే వైసీపీ ని గద్దె దింపడం బటన్ నొక్కినంత ఈజీ అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories