వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని విషయంలో ఉద్దేశపూర్వకంగా రేపుతున్న గందరగోళంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఇప్పటికే రాజధాని రైతులకు ఈ విషయంగా హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాలలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ వందరోజుల పాలనపై నివేదికను విడుదల చేశారు. మొత్తం తొమ్మిది అంశాలపై నివేదిక విడుదల చేసింది. ఈ సందర్భంగా రాజధాని మార్పుపై స్పందించారు.
“రాజధానికి గతంలో ఇచ్చిన మద్దతును వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మరిచిపోయారు. రాజధాని అంటే 34వేల ఎకరాల భూమి కాదు.. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్. రాజధానిపై గత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే… మీరివ్వండి. రాజధానిపై డోలాయమాన పరిస్థితి సృష్టించడం సరికాదు. రాజధానిని మార్చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. ఏపీపై ప్రజలకు ప్రేమ, విశ్వాసం ఉందా అనే అనుమానం ఉంది” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అనుసరించాల్సిన ప్రణాళికలు, విధివిధానాలను సూచించేందుకు ప్రభుత్వం శుక్రవారం ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి ప్రణాళికలను సమీక్షించడంతోపాటు రాష్ట్రం, రాజధాని అన్ని రంగాల్లో ప్రగతిపథాన సాగేందుకు ఉపకరించే సమగ్ర వ్యూహాన్ని సూచించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నివేదికను 6 వారాల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు.



