ఇప్పటివరకు మాటల రచయితగా, దర్శకుడుగా పరిచయమైన త్రివిక్రమ్ శ్రీనివాస్, త్వరలో మరో రూపం దాల్చబోతున్నాడు. ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడని లభించిన విశ్వసనీయ సమాచారం. తన తొలి ప్రాజెక్ట్ గా హీరో నితిన్ కాంభినేషన్ ప్రకటించనున్నారని, ఈ సినిమా ద్వారా కృష్ణ చైతన్య అనే దర్శకుడు పరిచయం కాబోతున్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ‘హింట్’ను నితిన్ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రకటించి ఉన్నారు.
అలాగే ఈ ప్రాజెక్ట్ తో పాటు మరో రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయని, నందిని రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక ప్రాజెక్ట్ కాగా, అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ సిద్ధంగా ఉందని సమాచారం. దీంతో వచ్చే ఏడాదిలో త్రివిక్రమ్ నిర్మించిన ఈ మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే, ఈ మూడు సినిమాలకు కధలు ఎవరు అందించనున్నారు అనే దానిపై ఒక స్పష్టత రావాల్సి ఉంది.
నితిన్ సినిమాకు త్రివిక్రమ్ అందించిన కధే తెరకెక్కనుందని పక్కా సమాచారం లభ్యం కాగా, నందిని రెడ్డి, అవసరాల సినిమాలు ఎవరి కధతో ముందుకు వెళ్తాయో చూడాలి. అలాగే డైలాగ్స్ విషయంలో కూడా మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఏ స్థాయి కధకైనా త్రివిక్రమ్ డైలాగ్స్ తోడయితే, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయం. మరి ఈ మూడు సినిమాలకు అందించే డైలాగ్స్ సంగతులు కూడా కీలకం కానున్నాయి. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ లపై అధికారిక సమాచారం వెలువడనుంది.



