‘తీరు’ మారకపోతే ‘రాత’ మారదు!

Pawan Kalyan Varahi Yatra

ఒక స్టార్ హీరో స్థాయిని అనుభవిస్తూనే ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ‘జనసేన’ను స్థాపించి, తద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికలలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. గతం ఎలా ఉన్నా, ఈ సారి నన్ను నమ్మండి, వ్యూహాలు నాకు వదిలిపెట్టండి, ఓటు మాత్రం జనసేనకు వేయండి అంటూ పిలుపునిచ్చి పిఠాపురం నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే… ఈ సమయానికి పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రసంగాల పైన విశ్లేషణలు చేయాల్సి ఉండేది. కానీ యధావిధిగా తన ‘వాయిదా’ తీరును తాజాగా కూడా అనుసరిస్తున్నారు. కూటమిగా ఏర్పడిన మూడు పార్టీలు కలిసి చిలకలూరిపేటలో నిర్వహించిన బహిరంగ సభ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజా క్షేత్రానికి దూరమయ్యారు.

ADVERTISEMENT

ఓ పక్కన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు అందుబాటులో లేకుండా ఇంకా సహచర పార్టీలతో సమావేశాలు, వేసవి కాలం విశ్రాంతి అంటూ ఢిల్లీ, హైదరాబాద్ లలో చక్కర్లు కొట్టడం… ఇలాంటి పొలిటికల్ హీట్ రగులుతున్న సమయంలో జనసేన అధినేత నుండి ఏ మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు.

27వ తేదీన మలి విడత వారాహి యాత్రను తానూ పోటీ చేయబోయే పిఠాపురం నుండి ప్రారంభించబోతున్నట్లుగా అధికారిక వార్తను వెలువరించి, పార్టీ కార్తకర్తలలో, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. తీరా 27వ తేదీ వచ్చేసరికి తూచ్ అంటూ 31వ తేదీకి వాయిదా వేస్తూ మరో ప్రకటన జారీ చేసి అదే పార్టీ క్యాడర్ ను నీరుగార్చారు.

ఈ వాయిదాను సమర్ధించుకునే విధంగా అనేక కారణాలు చెప్పొచ్చు, కానీ పొలిటికల్ కెరీర్ తొలినాళ్ళ నుండి పవన్ కళ్యాణ్ అనుసరిస్తోన్న తీరు ఇదే కావడంతో విమర్శలకు దారి తీస్తోంది. పవన్ కళ్యాణ్ కు విపరీతమైన అభిమాన గణం, మాస్ క్రేజ్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు, కానీ ప్రజా క్షేత్రంలో అవేమీ పని చేయవన్న విషయాన్ని గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పాయి.

అందులోనూ పిఠాపురంలో పవన్ గెలుపును ఎలా అయినా నిలువరించాలనే దృఢ సంకల్పంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా తన ప్రధాన బలగానికి చాలా “బరువైన” బాధ్యతలను అప్పగించారు. పిఠాపురంలో మండలాల వారీగా విభజనలు చేసి వైసీపీకి అనుకూలంగా ఓట్లు రాబట్టే బాధ్యతలను అనుచర వర్గానికి కేటాయించగా, వారంతా ఇప్పటికే వాటిని నిర్వర్తించే పనిలో నిమగ్నం అయ్యారు.

ఈ సారి గనుక కాస్త అటు ఇటు అయ్యి పవన్ కళ్యాణ్ గెలుపు తీరాలకు చేరుకోకపోతే, ఇక ‘జనసేన’ పార్టీ ఉన్నా లేనట్లే! తాను ఒక స్టార్ హీరో, దైవ స్థాయిలో చూసుకునే అభిమానులు ఉన్నారు, తానూ ఒక నియోజకవర్గానికి చెందిన నేతను కాదు, రాష్ట్ర స్థాయి రేంజ్ అనే తలంపుతో పవన్ కళ్యాణ్ ఇంకా ఉంటే గనుక, కాస్త ఆ మబ్బులు తొలగించుకుని క్షేత్రస్థాయిలో బరిలోకి దిగాల్సిన ఆవశ్యకత ఎంతైనా కనపడుతోంది.

హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తో రాజకీయ చర్చలు జరిపిన చంద్రబాబు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి దిగి, 73 ఏళ్ళ వయసులోనూ తన రాజకీయ నిబద్ధతకు సాటి రారని చెప్పకనే చెప్పారు. అలాగే 27వ తేదీ నుండి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా చెప్పిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా తన కార్యక్రమాలను ప్రారంభించారు.

కానీ పవన్ ఒక్కరే ఇలా వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు. బీజేపీ చేరికతో కూటమిలో లుకలుకలు మరియు బీజేపీ చేతిలో పవన్ కీలు బొమ్మ, జనసేన ప్రచారానికి కూడా బీజేపీ అనుమతులు కావాలి అంటూ ప్రత్యర్థి వర్గాలు చేస్తోన్న విమర్శలకు చెక్ పెట్టాలంటే కనీసం ఈ సారైనా చెప్పిన 31వ తేదీకి తన మలివిడత ఎన్నికల ప్రచారాన్ని పవన్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ 45 రోజులైనా అవిశ్రాంతంగా శ్రమించి పార్టీని విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉంది.

ADVERTISEMENT
Latest Stories